దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వారం రోజుల నుంచి నిత్యం 40 వేలకు పైబడి కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 47,092 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత రెండు నెలల వ్యవధిలో నమోదైన కోవిడ్ కేసుల్లో ఇవే అత్యధికం. తాజాగా నమోదైన వాటితో కలిపి ఇండియాలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,28,57,937కు చేరింది. 24 గంటల వ్యవధిలో 509 మంది కోవిడ్ కారణంగా కన్నుమూశారు. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 4,39,529కు పెరిగింది.
ఇక నిన్న ఒక్క రోజే 35,181 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,20,28,825కు చేరింది. దేశంలో రికవరీ రేటు 97.48 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటివరకు మొత్తం 66,30,37,334 మందికి కోవిడ్ టీకాలు అందించారు. నిన్న ఒక్క రోజే 81,09,244 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కేరళలో ఇంకా కేసులు తగ్గలేదు..
కేరళలో గడిచిన 24 గంటల్లో 32,803 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్య శాఖ తన బులెటిన్ లో పేర్కొంది. దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో మూడింట రెండు వంతులు ఈ రాష్ట్రం నుంచే రావడం అధికారులను కలవర పెడుతోంది.
ఐసోలేట్, రెస్ట్, హైడ్రేట్..
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది. కోవిడ్ లక్షణాలు కనపడగానే ఒంటరిగా ఐసోలేట్ అయిపోవాలని సూచించింది. ఐసోలేట్, రెస్ట్, హైడ్రేట్ అనే మూడింటినీ పాటించాలని సూచనలు చేసింది.
లక్షణాలు ఉన్న వారు ఇంట్లో కూడా మాస్క్ (వీలైతే రెండు మాస్కులు) ధరించాలని తెలిపింది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఎప్పటికప్పుడు హైడ్రేట్ అవుతుండాలని పేర్కొంది. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని సూచించింది. సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలని పేర్కొంది.