Sharmila Son Raja Reddy Marriage Reception: హైదరాబాద్: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజా రెడ్డి మ్యారేజ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు. రాజా రెడ్డి, ప్రియల వెడ్డింగ్ రిసెప్షన్ శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది. రాజస్థాన్‌లో వివాహం కావడంతో రిసెప్షన్ ఇక్కడే గ్రాండ్‌గా చేయాలని ప్లాన్ చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, కేవీపీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వీరితో పాటు రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు షర్మిల తనయుడు రాజా రెడ్డి మ్యారేజ్ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదిర ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రిసెప్షన్‌లో కనిపించని ఏపీ సీఎం జగన్!
జోధ్‌పూర్ లో జరిగిన వివాహానికి షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గైర్హాజరు కావడం తెలిసిందే. శనివారం (ఫిబ్రవరి 24న) రాత్రి శంషాబాద్‌లో జరిగిన షర్మిల కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్‌కు సైతం వైఎస్ జగన్ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. అంతకుముందు గత నెలలో హైదరాబాద్ లో జరిగిన రాజా రెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయారు.
రాజస్థాన్‌లో షర్మిల తనయుడి వివాహం..
ఫిబ్రవరి 17న వైఎస్ షర్మిలా రెడ్డి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్‌ల కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఓ ప్యాలెస్‌లో వైఎస్ రాజారెడ్డి (YS Raja Reddy), అట్లూరి ప్రియ (Atluri Priya)ల వివాహం వైభవంగా జరిగింది. ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వైఎస్ విజయమ్మ ఇంటి పెద్దగా మనవడి వివాహం జరిపించారు. మరుసటిరోజు క్రైస్తవ సాంప్రదాయంలోనూ రాజారెడ్డి, ప్రియల వివాహం ఘనంగా జరిగింది. దివంగత నేత వైఎస్సార్ ఫొటో సమక్షంలో వివాహ వేడుక అనంతరం ఇరు కుటుంబసభ్యులు ప్రత్యేక ప్రార్థనలు సైతం నిర్వహించారు.