కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు రుణమాఫీ విషయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లిచ్చామని దొర చెప్తుంటే.. సాగుకు చుక్క నీరు లేక కాలువల పొంటే బోర్లు వేసుకొనే దుస్థితి రైతులదని అన్నారు. మండుటెండల్లో మత్తడి పారుతుందని కేసీఆర్ దొంగ పండుగలు చేస్తుంటే.. నారుమడికైనా కాసిన్ని నీళ్ళు లేవనేది రైతుల వాదన అని అన్నారు. 


‘‘9 ఏండ్లలో ఉన్న బోర్లకు అదనంగా 15 లక్షల కొత్త బోర్లు పడ్డాయంటే.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ పని తీరు చెప్పనక్కర్లే. మసి పూసి మారేడు కాయ చేసినట్లు.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం  "గోదారి నీళ్లను గోదారిలో ఎత్తిపోయడానికే". 38 వేల కోట్లతో మహానేత కట్టాలనుకున్న తెలంగాణ జీవధార ప్రాణహిత - చేవెళ్లను రీడిజైన్ చేసి కల్వకుంట్ల కుటుంబానికి కమీషన్ల ధారగా మార్చాడు. కోటి ఎకరాల పేరుతో కోటి భ్రమలే తప్పా లక్ష ఎకరాలకు దిక్కులేదు. 


లక్ష 51 వేల కోట్లతో ప్రపంచం గర్వించే ప్రాజెక్ట్ కట్టి ఫామ్ హౌజ్ కి తప్ప తెలంగాణ మాగాణికి పారింది లేదు. బోరు ఉంటే సాగు.. లేకుంటే పడావులా ఉంది తెలంగాణ వ్యవసాయం. పనికి రాని ప్రాజెక్టులకు వేల కోట్లు కరెంట్ బిల్లులు కట్టే దొర గారు.. రైతులకు సరిపడా  కరెంట్ మాత్రం ఇవ్వరు. కాలువల్లో నీళ్ళు రావు. బోర్లు  నడవవు. పంటల్ని ఎండబెట్టి.. రైతుల్ని రోడ్లపైకి ఈడ్చి పట్టుమని 8 గంటలు ఇయ్యలేనోళ్ళు.. 24 గంటలు ఇస్తున్నం అంటుంటే..దెయ్యాలు వేదాలు పలికినట్లుంది. 24 గంటల ఉచిత విద్యుత్ అబద్ధం అనడానికి ట్రాన్స్ కో,జెన్కో సీఎండీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.


"మూడు పంటలు అబద్ధం - 24గంటల కరెంటు పచ్చి అబద్ధం"


రైతు రుణమాఫీపై దొర గారిది పూటకో మాట, రోజుకో వేషం.నమ్మి ఓటేస్తే పథకానికే పంగనామాలు పెట్టి, రైతులకు ఎగనామం పెట్టిన మోసగాడు కేసీఆర్.లక్ష మాఫీకి 4 ఏళ్లుగా లక్ష మాటలు చెప్పిండే తప్ప లక్ష్యం మాత్రం నెరవేర్చలే. మాట తప్పం, మడమ తిప్పం..ఆరు నూరైనా, నూరు ఆరైనా,మాట ఇస్తే తల నరుక్కుంటం అంటూ రుణమాఫీపై చేసిన వాగ్దానాలు దొర గడప దాటలే.రైతులకు రుణాలు మాఫీ కాలే. కేసీఆర్ బూటకపు హామీని నమ్మి ఓటేసిన పాపానికి రైతన్న బ్యాంకుల దగ్గర దోషిలా నిలబడ్డడు.నోటీసుల మీద నోటీసులు అందుకుంటున్నడు. దేశ చరిత్రలోనే అన్నం పెట్టే రైతన్నకు "డీ ఫాల్టర్" అనే ముద్ర వేసిన పాపం ద్రోహి కేసీఆర్ కే దక్కింది. 


రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతుల  ఇండ్ల మీద పడుతున్నా..రైతు బంధు పైసలను వడ్డీల కింద జమ చేసుకుంటున్నా...20 లక్షల అకౌంట్లను ఫ్రీజ్ చేసినా...రోడ్ల మీద పడి రైతులు ఆందోళనలు చేస్తున్నా కేసీఆర్ కు కనీసం చీమ కుట్టినట్లైనా లేదు.కరోనా పేరు చెప్పి రైతులకు చెల్లించాల్సిన 6 వేల కోట్లకే 60 కష్టాలు చెప్పే దొరలకు.. కాళేశ్వరం కట్టడానికి లక్ష కోట్లు ఎక్కడ నుంచి వచ్చినయ్ ? అప్పు తెచ్చిన 5 లక్షల కోట్లు ఎక్కడ పోయినయ్ ? 


విలాసాలకు,కొత్త భవనాలకు వందల కోట్లు ఎక్కడియ్ ?35 వేల ఎకరాలు అమ్మిన సొమ్ము ఎక్కడ పెట్టినట్లు ?  కరోనా కష్టకాలమే అయితే BRS అకౌంట్లో 12 వందల కోట్లు ఎట్లొచ్చినయ్ ? పథకాలకు నిధులు ఉండవ్ కానీ ..దేశ రాజకీయాలకు ఫండింగ్ చేసేంత సొమ్ము కేసీఆర్ దగ్గర ఉంటది.దీన్నే అంటారు బంగారు తెలంగాణ.ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకోవడమే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్.మాట మీద నిలబడే దమ్ము కేసీఆర్ కు ఉంటే.. తక్షణం 31 లక్షల మంది రైతులకు లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది’’ వైఎస్ షర్మిల ట్వీట్లు చేశారు.