Congress Gas Cylinder Guarantee scheme : అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇస్తూ వచ్చింది. ఇటీవలే సోనియా గాంధీ పుట్టినరోజున సీఎం రేవంత్ రెడ్డి రెండు స్కీములను ప్రారంభించారు. అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంపు.
ఇవే కాక మరో నాలుగు గ్యారంటీలు అమలుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైనది రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం. ఎన్నికల ప్రచారంలో ఈ స్కీమ్‌ను కాంగ్రెస్ నేతలు బాగా వాడుకున్నారు. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందరూ అనుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మహిళల దృష్టి మొత్తం గ్యాస్ సిలిండర్లపై పడింది. ఈ క్రమంలోనే ఎలాగైనా సిలిండర్ సొంతం చేసుకోవాలని ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకుని క్యూ కడుతున్నారు.
పథకాన్ని ఎప్పటినుంచి ప్రారంభిస్తారని నిర్వాహకులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కేవైసీ చేయించుకున్న వారికే ఇస్తారన్న ప్రచారం జరుగుతూండటంతో ఈ కేవైసీ చేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థఇతి కనిపిస్తోంది. ఏజెన్సీ ఉద్యోగులు మాత్రం మహాలక్ష్మి పథకానికి ఈకేవైసీకి సంబంధం లేదని, కాబట్టి డిసెంబర్ 31 లోగా చేసుకోవాలని వారికి చెబుతున్నారు. వెంటనే అప్‌డేట్ చేయకుంటే సబ్సీడీలు వెంటనే నిలిపివేస్తారని ఏజెన్సీలు మహిళలకు సూచిస్తున్నాయి.
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేయాలనికాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాజకీయాలకు అతీతంగా ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ అమలు చేస్తామని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందరికీ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి ఆటో యజమానికి ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపన్నులకు, అన్నార్తులకు అండగా నిలిచేలా అందరినీ కలిసి సమస్యలు వినడం ప్రజాస్వామ్య పునరుద్ధరణకు సంకేతంమనికాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో నెలకు ఓ గ్యాస్ సిలిండర్ అవసరం అవుతుంది. నిన్నామొన్నటి వరకూ పన్నెండు వందల వరకూ ఖర్చు అయ్యేది. ఇటీవల కేంద్రం రెండు వందలు తగ్గించింది. అయనా భారమేనని మధ్యతరగతి భావిస్తోంది. రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తే.. ఎంతో కొంత ఆదా చేసుకోవచ్చని అనుకుంటున్నారు.