Vizag Steel Plant Bid :   విశాఖ ఉక్కు మంటలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్‌ హీటును ఒక్క సారిగా పెంచేశాయి. నేతల మాటల వేడి వేసవి వేడిని మించి పోతోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తప్పదన్న అంచనాల మధ్య బీఆర్‌ఎస్‌ ఎంట్రీ ఇచ్చింది. సింగరేణిని దించింది. ఈక్విటీ బిడ్‌ వేస్తామని ప్రకటిం చింది.   రూ.5వేల కోట్లు మూలధన నిధులు సేకరణకు   సంబంధించి బిడ్లను ఆహ్వానించింది. దీని ప్రకారం కనీస మూలధనం విలువ రూ.5వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన సంస్థకు స్టీల్‌ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి చేసే స్టీల్‌ను అందజేస్తారు. ఈ బిడ్‌లలో పాల్గొనడానికి నేటితో గడువు ముగియనుంది. 


 





 


ఇ ప్పటి వరకు కొన్ని సంస్థలు బిడ్‌లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు ఇందులో పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నట్లు అధికారులు ద్వారా తొలుత ప్రచారం జరిగింది. కేవలం ప్రయివేటు సంస్థలకు మాత్రమే బిడ్‌లలో పాల్గొనే అవకాశం ఉందని అంటూ వచ్చారు. అయితే ఇదంతా ఉత్తిత్తి ప్రచారమేనని మరికొందరు అధికారులు చెబుతున్నారు. ఎవరైనా బిడ్‌లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.  తెలంగాణ ప్రభుత్వం తరపున తరుపున సింగరేణి కంపెనీకి చెందిన డైరెక్టర్ల బృందం ఈ బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఇప్పటికే స్టీల్‌ప్లాంట్‌కు రావడం రెండు రోజుల పాటు పలువురు డైరెక్టర్లు, సిఎండితో భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ మూలధన సేకరణకు బిడ్ వేయాలని... సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 


సింగరేణి ద్వారా లేదా ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా బిడ్ వేయించాలని తెలంగాణ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉందని చెబుతున్నారు. దీనికి కారణం స్టీల్ ప్లాంట్ రాజకీయంలో బీజేపీ యూటర్న్ తీసుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని చెబుతూ.. మళ్లీ వెంటనే ..  డిజిన్వెస్ట్ ప్రక్రియ ఆపడం లేదని చెబుతున్నారు. దీంతో.. స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొని తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంలో సీరియస్‌గా ఉందని నిరూపించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  


ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్‌లో పాల్గొనకపోతే విపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఉంది  రాజకీయ ప్రయోజనాల కోసమే బిడ్డింగ్ లో పాల్గొంటామని హడావుడి చేశారని... అంతగా ఆర్థిక వెసులుబాటు ఉంటే తెలంగాణలో మూతపడిన పరిశ్రమల్ని తెరిపించాలన్న డిమాండ్లు విపక్షాలు చేస్తున్నాయి. ఇప్పుడు  వెనక్కి తగ్గితే ఈ విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంది.