Somesh What Next : మంగళవారం ఉదయం వరకూ సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ. కానీ గంటల్లో మారిపోయిన పరిస్థితుల కారణంగా సాయంత్రానికి ఆయన పదవి పోయింది. అసలు తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీ క్యాడర్ కు మారిపోయారు.ఇప్పుడు తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీ కూడా వచ్చేశారు. ఇప్పుడు సోమేష్ కుమార్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అప్పీల్‌కు కూడా చాన్స్ లేకుండా సాయంత్రానికి ఆయనకు ఊస్టింగ్ ఆర్డర్స్ వచ్చేశాయి. పన్నెండో తేదీ అంటే గురువారమే ఏపీలో రిపోర్టు చేయాలని డీవోపీటీ ఉత్తర్వులు రిలీజ్ చేసేసింది. హడావుడిగా వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమైనా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు ఆయన ముందు రెండే మార్గాలున్నాయి. ఒకటి వెళ్లి ఏపీ సర్వీసులో చేరిపోవడం.. రెండు వీఆర్ఎస్ తీసుకుని తెలంగాణ ప్రభుత్వంలోనే సలహాదారుగా చేరిపోవడం.
వీఆర్ఎస్ తీసుకోవాలన్నా ముందు వెళ్లి ఏపీ క్యాడర్‌లో చేరాల్సి ఉంటుంది. అందుకే సోమేష్ కుమార్ డీవోపీటీ ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం అమరావతి వెళ్లనున్నట్లుగా చెబుతున్నారు. సచివాలయానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో సమావశం అవుతారని.. మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ తో సమావేశమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముందుగా రిపోర్ట్ చేయడం తప్పని సరి.. ఆయన సీఎస్‌కు రిపోర్ట్ చేస్తే ఆ తర్వాత ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుంది. ప్రస్తుతం సీఎస్ స్థాయిలో పని చేసినందున.. ఏపీలో ఏ పోస్టు ఇచ్చినా ఆయన సర్దుకోవడం కష్టమే. అలాగని ఆయనకు చీఫ్ సెక్రటరీ పోస్టును ఏపీలో కేటాయించే అవకాశం లేదు.
సోమేష్ కుమార్ కు ఇంకా పదకొండు నెలలు మాత్రమే సర్వీస్ ఉంది. ఈ పదకొండు నెలలు ఏదో ఓ లూప్ లైన్ పోస్టులో కొనసాగి రిటైర్ అయిపోవడం మంచిదన్న ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఆయన ఏపీ సర్వీస్ లో చేరి వెంటనే వాలంటరీ రీటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆయనను తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్ .. సలహాదారుగా నియమించే అవకాశం ఉందంటున్నారు. పదకొండు నెలల సర్వీస్ వదులుకుని సలహాదారుగా చేరిపోవాలా వద్దా అనే ఆలోచన సోమేష్ కుమార్ చేస్తున్నారు. సలహాదారు పదవి తీసుకున్నా.. అది ఆయనకు ఎంత కాలం సర్వీస్ ఉందే అంతే ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నవంబర్, డిసెంబర్‌లో జరగనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం మారినా.. మారకపోయినా ఆయనకు పదవి ఉంటుందని చెప్పడం కష్టం.
సీఎస్ సోమేష్ కుమార్ విషయలో తెలంగాణలో అనేక విమర్శలు ఉన్నాయి. ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ధరణి అంశం ప్రభుత్వాన్ని చికాకు పరుస్తోంది. సోమేష్ రెండు సార్లు సర్వీస్ నుంచి లాంగ్ లీవ్ తీసుకుని ప్రైవేటు సంస్థల్లో పని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన కంటే ఎనిమిది మంది సీనియర్లు ఉన్నప్పటికీ కేసీఆర్ ఆయనకు సీఎస్ పోస్టు ఇచ్చారు. ఏపీలో ఎలాంటి పోస్టులో చేరినా అది తన స్థాయికి చిన్నదే కాబట్టి.. ఐఏఎస్ సర్వీస్ కు రాజీనామా చేయాలని అనుకుంటున్న ట్లుగా తెలుస్తోంది.