Ponguleti :   ఖమ్మం సీనియర్ రాజకీయ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి నోట సొంత పార్టీ మాట వినిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో రైతు భరోసా ర్యాలీ నిర్వహిస్తున్న ఆయన... కలెక్టరేట్ ఎదుట ధర్మా చేశారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 30 వేల రూపాయులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన అవసరం అయితే సొంత పార్టీ పెడతానని ప్రకటించారు. పొంగులేటి ప్రకటన తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనం అవుతోంది. ఆయన యథాలాపంగా అన్నారా.. లేకపోతే నిజంగానే ప్లాన్ ఉందా అన్నది చర్చనీయాంశమవుతోంది.    


రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్న పొంగులేటి 


పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్ మినహా దాదాపు అన్నిరాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పొంగులేటి కోసం భారీ ఆఫర్లు ఇచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది సీట్లలో ఎనిమిది .. పార్లమెంట్ స్థానంతో సహా ఆయన వర్గానికే ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టింది. అయితే పొంగులేటి ఏమీ చెప్పలేదు. తర్వాత బీజేపీ చేరికల కమిటీ కూడా ఆయనతో చర్చించంది. ఏం ఆఫర్లు ఇచ్చారో స్పష్టత లేదు కానీ..  త్వరలో చెబుతామని ప్రకటించారు.  సమయం పడుతుందని పొంగులేటి చెప్పుకొచ్చారు. మరో వైపు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆయనకు ఆఫర్లు ఇచ్చేందుకు రంగంలోకి దిగారు. వారితో కూడా చర్చించేందుకు ఆయన సిద్ధమయ్యారు. 


టీఆర్ఎస్ పార్టీని తెరపైకి తీసుకు వస్తారా ? 


అయితే పొంగులేటి  రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను ప్రకటించి వారి కోసం రాజకీయం చేస్తున్నారు . ప్రచారం ప్రారంభించారు. ఏ పార్టీలో చేరిన వారంతా ఆ పార్టీ అభ్యర్తులని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. ఇప్పుడు కొత్తగా సొంత పార్టీ గురించి ఆయన ఆలోచిస్తున్నారు. నిజానికి సొంత పార్టీ అనేది అంతర్గగతంగా జరుగుతున్న వ్యవహారం అని... కొంత కాలంగా ప్రచారం జరుగుతోదంది. టీఆర్ఎస్ పేరుతో  ఓ పార్టీని ఇటీవల కొంత మంది రిజిస్టర్ చేశారు. ఆ పార్టీ వెనుక తెలంగాణ కీలక నేతలు ఉన్నారని చెబుతున్నారు. పొంగులేటితో పాటు మరికొంత మంది ముఖ్యనేతలు కలిసి టీఆర్ఎస్ పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. బహుశా.. ఇలాంటి ఆలోచన ఉండబట్టే ఆయన నోట రాజకీయ పార్టీ మాట వచ్చిందని భావిస్తున్నారు. 


పొంగులేటి రాజకీయ పయనంపై ఆసక్తి                         


ఖమ్మంలో ప్రముఖ నేతలకు లోటు లేదు. కానీ అందరూ ఒకే పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ నుంచి పొంగులేటి ఒక్కరే బయటకు వచ్చారు. ఈ కారణంగా ఆయనను పార్టీలో చేర్చుకోవాలని అన్ని పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న పొంగులేటి అందరితోనూ మాట్లాడుతున్నారు. కానీ ఎవరికీ ఆఫర్ ఇవ్వడం లేదు.