హుజూరాబాద్‌లో ఉపఎన్నిక కోసం అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామా ఆమోదించిన మరుక్షణం నుంచి హుజూరాబాద్ ఓ రకంగా యుద్ధ భూమి అయిపోయింది. అప్పట్నుంచి పెద్ద ఎత్తున అన్ని పార్టీల బలగాలు అక్కడ మోహరించాయి. ఇదిగో ఉపఎన్నిక నోటిఫికేషన్ అంటే..అదిగో ఎన్నికల షెడ్యూల్ అంటూ.. . టెన్షన్ కూడా పడుతున్నారు. కానీ ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు ఉపఎన్నిక ఇప్పుడల్లా జరిగే అవకాశం ఉందా.. అన్న అనుమానం కలగక మానదు. ఎందుకంటే.. జాతీయ రాజకీయాల్ని ఒక్క సారి చూస్తే.. ఎందుకు ఉపఎన్నిక జరగదో కూడా మనకు ఓ క్లారిటీ వస్తుంది.
ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ తో బీజేపీ హైకమాండ్ రాజీనామా చేయించింది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి సెప్టెంబర్ వరకు గడువు ఉన్నా ఎన్నికలు జరగవన్న కారణంతో రాజీనామా చేయించారు. బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం బెంగాల్ ను టార్గెట్ చేయడమే అంటున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఎమ్మెల్యే కాదు. ఆమె నందిగ్రాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆరు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. కాకపోతే రాజీనామా చేయాల్సిందే. ప్రస్తుతం బెంగాల్‌లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీగా ఉంది. ఇది మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం. అక్కడ్నుంచి గెలిచిన ఎమ్మెల్యేతో వెంటనే రాజీనామా చేయించారు. కానీ ఉపఎన్నిక పెట్టే పరిస్థితి లేకనే... తమ సీఎంతో రాజీనామా చేయించామని బీజేపీ ప్రచారం చేస్తోంది. దీంతో బెంగాల్‌లోనూ ఉపఎన్నిక జరగదని చెబుతున్నారు. బీజేపీ వ్యూహాన్ని గుర్తించిన మమతా బెనర్జీ మండలిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది కూడా పార్లమెంట్‌లో చట్టం కావాల్సి ఉంది. అంటే బీజేపీ చేతుల్లోనే ఉంది.
అందరూ అనకుంటున్నట్లుగా మమతా బెనర్జీని అసెంబ్లీకి ఎన్నిక కాకుండా ఉండటానికి ఉపఎన్నికలు పెట్టే పరిస్థితి లేకపోతే.. హుజూరాబాద్ లో నూ ఉపఎన్నిక జరగదు. దేశంలో మిగతా అన్ని చోట్లా... ఉపఎన్నికలు వదిలేసి... ఒక్క హుజూరాబాద్‌కే నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇస్తే అన్ని నియోజకవర్గాలకూ ఇవ్వాలి. ఏపీలో బద్వేలు నియోజకవర్గం కూడా ఖాళీగా ఉంది. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే కరోనా కారణంగా చనిపోయారు. అందుకే.. హజూరాబాద్ ఉపఎన్నిక జరగకపోవడానికే ఎక్కువ అవకాశం ఉందంటున్నారు. ధర్డ్ వేవ్ హెచ్చరికలు ఇప్పటికే ఓ రేంజ్‌లో వినిపిస్తున్నాయి. ఇది కూడా... ఓ కారణం కావొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు.. హుజూరాబాద్ లో నువ్వా నేనా అన్నట్లు.. కార్యకర్తలతో గ్రామాలన్నీ చుట్టేస్తున్నాయి. ఉపఎన్నిక జరగకుంటే.. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆసక్తికరంగా మారింది.
Also Read: pegasus Spyware: రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్.. పెగాసస్ లిస్ట్ పెద్దదే..