BJP First List :  తెలంగాణ బీజేపీ మొదటి జాబితా కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. బీజేపీ ఎలక్షన్ కమిటీ  ఢిల్లీ సమావేశం అయి తొలి జాబితాను ఖరారు చేస్తారని భావిస్తున్నారు. తొలి విడతలో 38 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేయాలని ఆ పార్టీ భావించింది. అందులో సింగిల్ నేమ్‌తో 21 మంది అభ్యర్థులను పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. మిగతా స్థానాల్లో ఒక్కో సెగ్మెంట్‌కు ఇద్దరి పేర్లను అధిష్టానానికి పంపినట్లు చెబుతున్నారు. అయితే ఎలక్షన్ కమిటీ మీటింగ్  జరుగుతుందాలేదా అన్నదాని ఇంకా స్పష్టత రాలేదు. 


సీనియర్ నేతలందరూ పోటీ చేయబోతున్నారా ? 


తెలంగాణ ఎన్నికల్లో సీనియర్లు అందరూ పోటీ చేసే అవకాశం ఉంది. అంబర్ పేట అసెంబ్లీ నుంచే కిషన్ రెడ్డి బరిలోకి దిగనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే కిషన్ రెడ్డి కార్యకర్తలకు స్పష్టత ఇచ్చారు. ఈ సారి ఎన్నికల్లో కే. లక్ష్మణ్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముషీరాబాద్ నుంచి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. నగర శివారు ప్రాంతాలపై కాషాయ నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎల్బీనగర్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంపై బూర నర్సయ్యగౌడ్ ఆసక్తి చూపుతున్నారు. రెండు స్థానాల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ఈటల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక కామారెడ్డి నుంచి అర్వింద్, గజ్వేల్‌లో ఈటల రాజేందర్, సిరిసిల్లలో బండి సంజయ్‌ పోటీ అంశంలో క్లారిటీ రావాల్సి ఉంది.  


బలమైన అభ్యర్థుల కోసం ఎదురు చూస్తారా ?                                
 
కాంగ్రెస్ ఇప్పటికే 55 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఈనెల 20 తర్వాత సెకండ్ లిస్ట్ ప్రకటించే అవకాశముంది. అయితే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తే బెటర్ అనే ఆలోచనలో స్థానిక నేతలున్నారని తెలిసింది. కాంగ్రెస్ ఫస్ట్, సెకండ్ లిస్టుల్లో టికెట్ రాని అసంతృప్తులను బీజేపీలో చేర్చుకోవాలని రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే బీజేపీ లిస్ట్ కోసం ఆశావహులు, పార్టీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.  


పొత్తులపైనా డైలమా !                                 


మరో వైపు కలసి పని చేసే అంశంపై  జనసేన పార్టీతో  బీజేపీ సంప్రదింపులు జరుపుతోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతోనూ మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టిక్కెట్ ప్రకటన  జాబితా వాయిదా పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే తొలి జాబితాలో సీనియర్లు .. అదీ కూడా పొత్తులు పెట్టుకున్నా కూడా ఇతర పార్టీలకు ఇవ్వని నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులే ఉంటారని చెబుతున్నారు. ప్రకటన వచ్చే వరకూ బీజేపీ నేతలకు టెన్షన్ తప్పదు.  మొత్తం టిక్కెట్ల కోసం ఆరు వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.