స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వెకేషన్ బెంచ్ కు బదిలీ అయ్యింది. బెయిల్ పిటిషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయాలని ఆయన తరఫు లాయర్లు అభ్యర్థించగా హైకోర్టు అంగీకరించింది. దీంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. 


'మధ్యంతర బెయిల్ ఇవ్వండి'


స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరగ్గా, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా కోరారు. ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్ పై ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గడిచిన 40 రోజులుగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే, ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది. కాగా, ఈ పిటిషన్ పై వచ్చే గురువారంలోగా విచారణ జరిగే అవకాశం ఉంది.


రిమాండ్ పొడిగింపు


మరోవైపు, చంద్రబాబు రిమాండును విజయవాడలోని ఏసీబీ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులు అంటే నవంబర్ 1 వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. గురువారం ఆయన్ను వర్చువల్ గా కోర్టు ముందు హాజరు పరచగా, న్యాయమూర్తితో మాట్లాడారు. ఈ క్రమంలో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. అయితే, తన భద్రత విషయంలో తనకు అనుమానాలున్నాయని చంద్రబాబు వివరించారు. దీనిపై స్పందించిన జడ్జి, ఇబ్బందులను రాతపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు అందివ్వాలని జైలు అధికారులను ఆదేశించారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టులను సైతం తనకు అందించాలని సూచించారు. 


'ములాఖత్ లు పెంచండి'


మరోవైపు, చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్ లను రెండు నుంచి ఒకటికి తగ్గించడంపైనా టీడీపీ నేతలు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లీగల్ ములాఖత్ లు మూడుకు పెంచాలని అభ్యర్థిస్తూ ఏసీబీ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదులకు ములాఖత్‌లు ఇవ్వకుండా జైలు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, పిటిషన్లకు సంబంధించి చంద్రబాబుతో చర్చించేందుకు లీగల్ ములాఖత్‌లు పెంచాలని ఏసీబీ కోర్టును కోరారు. న్యాయపరమైన అంశాలపై చంద్రబాబుతో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు.. లీగల్ ములాఖత్‌లు పెంచడంపై విచారించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.