మధ్యంతర బెయిల్ కోసం చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున ఇప్పుడు మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. చంద్రబాబుకు రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టుకు ఆయన తరఫున న్యాయవాది లూథ్రా విజ్ఞప్తి చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని అందుకే ఆయనకు ఇంటెర్మ్‌ బెయిల్‌ ఇవ్వాలని కోర్టులో వాదనలు వినిపించారు. 


దీనికి కౌంటర్‌గా వాదనలు వినిపించిన సీఐడీ తరఫున న్యాయవాది సుధాకర్ రెడ్డి.. మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిందని తెలిపారు. ఆయన ఆరోగ్యం బాగాలేదని చంద్రబాబు లాయర్‌ సాల్వే సుప్రీం కోర్టుకు తెలిపారని అయినా మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిందని వివరించారు. మరో పిటిషన్ సుప్రీం కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉందని వివరించారు. సుప్రీంలో బెయిల్‌ పిటిషన్‌ ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నప్పడు.. విచారణ చేయొద్దని హైకోర్టును తెలిపారు. 


సుప్రీంలో మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది నిజమేనా? అని లూథ్రాను హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. సుప్రీంలో చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి రిపోర్టులు అందజేయలేదన్నారు లూథ్రా. మధ్యంతర బెయిల్‌ ఇవ్వమని సుప్రీంలో మౌఖికంగా మత్రమే అడిగామని వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టే.. బెయిల్‌పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలన్నారు. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్‌తో  పరీక్షలు జరిపేందుకు అభ్యంతరం ఉందా అని పొన్నవోలును జడ్జి అడిగారు. 


చంద్రబాబు రిమాండ్‌ పొడిగింపు


చంద్రబాబు రిమాండ్‌ ను విజయవాడలోని ఏసీబీ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. నవంబర్ 1 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. చంద్రబాబును ఏసీబీ కోర్టు ముందు వర్చువల్‌గా అధికారులు హాజరు పరిచారు. చంద్రబాబుతో మాట్లాడిన జడ్జి.. ఆరోగ్యంపై అడిగి తెలుసకున్నారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు. వాటిని వివరిస్తూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని న్యాయమూర్తి తెలిపారు. ఆలేఖను తనకు పంపించాలని అధికారులను ఆదేశించారు.