Target KCR : తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన ఓటమి భయంతో ఉన్నారని విపక్షాలు ఓ అంచనాకు వచ్చాయి. అటు గజ్వేల్‌లో కానీ ఇటు కామారెడ్డిలో కానీ ఓ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ మాజీ చైర్మన్ కోదండరాం ఈ విషయాన్ని అన్ని పార్టీల ముందు ఉంచారు. కేసీఆర్‌పై ఉమ్మడి అభ్యర్థిని దింపితే బాగుంటుందని గద్దర్ ఆలోచన చేశారన్నారు. ఆ దిశ‌గా విప‌క్ష పార్టీలు ఆలోచ‌న చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ అంశంపై రాజకీయ  పార్టీలన్నీ ఓ స్పష్టతకు వచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. 


ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడం కష్టమే కానీ.. అసాధ్యం కాదు!


తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. అంటే.. తెలంగాణలోని ఏ ఒక్క పార్టీ కూడా ఆయనకు మద్దతుగా లేదు. అన్ని పార్టీలూ వ్యతిరేకమే. కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యంతో అన్ని పార్టీలూ ఉన్నాయి. అంటే.. అందరూ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టాడనికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ విపక్షాల్లో కాంగ్రెస్, బీజేపీలు కూడా ఉన్నాయి. రెండూ కలిపి ఒకే అభ్యర్థిని నిలబెట్టడం అన్నది అసాధ్యం. అదే సమయంలో ఓ పార్టీ తరపున నిలబెట్టిన  అభ్యర్థికి  మరో పార్టీ మద్దతు ఇవ్వడం  కూడా ఊహించలేము. ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఉమ్మడి అభ్యర్థి సాధ్యం కాదని ఎక్కువ మంది అనుకుంటారు. కానీ అసలు ఏ పార్టీ లేకుండా  .. గుర్తు లేకుండా తెలంగాణ పట్ల నిబద్దత ఉన్న నేతను ఇండిపెండెంట్ గా నిలబట్టి అందరూ మద్దతు ఇస్తే తటస్తులు కూడా .. ఓట్లు వేస్తారన్న విశ్లేషణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి 


తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో పాటుగా కోదండరాంకూ పేరు !


తెలంగాణ రాష్ట్ర సాధన పూర్తిగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన  ఉద్యమం ద్వారా జరిగింది. ఈ జేఏసీ వెనుక కేసీఆర్ కీలకశక్తి కానీ తెర ముందు ఉండి నడిపించింది మాత్రం ప్రొఫెసర్ కోదండరాం. కారణాలు ఏవైతేనేం... ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కు దూరమయ్యారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ఎందరో కీలక పదవుల్లో ఉన్నారని.. కోదండరాంకు ఏం తక్కువన్న సానుభూతి ఉద్యమకారుల్లో , ప్రజల్లో ఉంది.  అదే సమయంలో కేసీఆర్ ఎన్ని పదవులు ఆఫర్ ఇచ్చినప్పటికీ తిరస్కరించి పోరాట  పంధా ఎంచుకున్నారన్న మంచి పేరు ఉంది. దీంతో ఆయనే కేసీఆర్‌కు సరైన ఉమ్మడి ప్రత్యర్థి అవుతారన్న అంచనాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.


ఉమ్మడి అభ్యర్థిగా నిలబడేందుకు కోదండరాంను అన్ని పార్టీలు ఒప్పిస్తాయా ?


ఒక్కో పార్టీ వచ్చి అడిగితే కోదండరాం అంగీకరించకపోవచ్చు ..కానీ కాంగ్రెస్ ,  బీజేపీ సహా అన్ని పార్టీలు కలిసి వచ్చి ..  పోటీ చేయమని అడిగితే మాత్రం ఆయన అంగీకరించవచ్చు. కానీ రెండు జాతీయ పార్టీలు ఒకే ఒరలో ఇమడవు. అది దాదాపుగా అసాధ్యం. పార్టీల ముద్ర లేదు కాబట్టి.. తాము కేసీఆర్ పై పోటీ పెట్టడం లేదని..  తెలంగాణ కోసం సర్వం  త్యాగం చేసిన కోదండరాం లాంటి వారు అసెంబ్లీకి రావాల్సి ఉంది కాబట్టి.. ఎవరూ పోటీ పెట్టడం లేదని చెప్పి.. ప్రచారాలు లేకుండా ఉంటే...  సాధ్యమవుతుంది. అంటే..  కోదండరాం నిలబడతారు కానీ ఎవరూ బరిలో ఉండరు కేసీఆర్ తప్ప. ఆయనపై పార్టీ ముద్రలు ఉండవు. ఏ పార్టీలు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాదు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఎవరివైపో అంచనా వేయడం కష్గంగా ఉంది. అందకే ఈ ప్రతిపాదన ఎంత మేర ముందుకు వెళ్తుందన్నది అంచనా వేయడం కష్టమే.