Wild Animals Truck Overturns In Nirmal District: నిర్మల్ జిల్లాలోని (Nirmal District) మొండిగుట్ట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వన్యప్రాణులను తరలిస్తున్న లారీ బోల్తా పడింది. దీంతో 2 మొసళ్లు రహదారిపై పడ్డాయి. అదృష్టవశాత్తు వన్యప్రాణులన్నీ సురక్షితంగా బయటపడ్డాయి. బీహార్ రాజధాని పట్నాలోని (Patna) సంజయ్ గాంధీ జాతీయ జూపార్కు నుంచి వివిధ రకాల వన్యప్రాణులను రెండు వాహనాల్లో బెంగళూరులోని బన్నేర్‌గట్ట జాతీయ జూపార్కుకు తరలిస్తున్నారు. వీటిలో మరియాల్ జాతి 8 మొసళ్లు, రెండు తెల్ల ఏనుగులు, రెండు తెల్లపులులు సహా ఇతర జంతువులు ఉన్నాయి.
ఈ క్రమంలో మామడ మండలంలోని మొండిగుట్ట గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఓ ట్రక్కు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టగా.. వాహనం రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మొసళ్లలో రెండు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ అధికారులు అక్కడికి చేరుకొని సిబ్బందితో ఆ రెండు మొసళ్లను పట్టుకుని మరో వాహనాన్ని తెప్పించి వన్యప్రాణులను తరలించారు. వన్యప్రాణుల లారీ బోల్తా పడ్డ విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రమాద స్థలాన్ని వన్యప్రాణులను పరిశీలించారు. వన్య ప్రాణులకు ఎలాంటి హాని కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.