సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమ(Sigachi Industries)లో రియాక్టర్ పేలడంతో 12 మంది కార్మికులు చనిపోయారు. 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తరచూ పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం, వాటి వల్ల కార్మికులు చనిపోవడం లేదా తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. అయితే, ఈ పరిశ్రమల్లో ఎందుకు పేలుళ్లు జరుగుతాయన్న అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
రసాయన చర్యల కారణంగా పేలుళ్లు
పరిశ్రమల్లో ఉత్పత్తి జరగాలంటే రసాయన పదార్థాలు వాడటం తప్పనిసరి. అందులో కొన్నిసార్లు ప్రమాదకరమైన రసాయనాలు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో, రసాయన ప్రతిచర్యలు కొన్నిసార్లు నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. అంటే, రియాక్టర్లలో అధిక ఉష్ణోగ్రత, పీడనం పెరిగిపోయి నియంత్రణ కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి. ఉష్ణాన్ని విడుదల చేసే (exothermic) ప్రతిచర్య సరిగా చల్లబడకపోతే, అవి పేలుడుకు దారితీస్తాయి.
రసాయన మిశ్రమాల వల్ల పేలుళ్లు
కొన్ని సందర్భాల్లో, పరిశ్రమల్లో ప్రమాదకర రసాయన పదార్థాలను వాడాల్సి వస్తుంది. వీటిని కార్మికులు తెలిసీ తెలియక కలిపినా, లేక పొరపాటున రెండు ప్రమాదకర రసాయన పదార్థాలు కలిసినా అవి తీవ్రమైన, వేగంతో ప్రతిచర్యకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ ప్రతిచర్యలు పేలుళ్లకు కారణం కావచ్చు. నిపుణులు చెప్పేది ఏంటంటే, కొన్ని రసాయనాలు సహజంగా అస్థిరంగా ఉంటాయి. ఉదాహరణకు, పెరాక్సైడ్‌లు వంటి రసాయన పదార్థాలు చిన్న మార్పులకు లోనైనా పేలుళ్లకు కారణం కావచ్చు.
వాయువుల ఒత్తిడి పెరగడం వల్ల పేలుళ్లు
పరిశ్రమల్లో వినియోగించే రసాయనాల వల్ల, కొన్నిసార్లు ఉత్పత్తికి అవసరమైన వాయువులు వాడే సందర్భంలో ఈ పేలుళ్లు జరగవచ్చు. రసాయన ప్రక్రియ సందర్భంలో పెద్ద ఎత్తున వాయువులు జనించే అవకాశం ఉంది. వాటిని సరైన రీతిలో ఒత్తిడి లేకుండా బయటకు పంపించాల్సి ఉంటుంది. అలా వాటిని సరిగా బయటకు పంపకపోతే, రియాక్టర్లలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి భారీ పేలుళ్లు జరిగే అవకాశం ఉంది.
పైన చెప్పినవన్నీ రసాయన, వాయు పదార్థాల ప్రభావంతో జరిగే పేలుళ్లు. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఈ ప్రమాదాలు జరగకుండా సంబంధిత యాజమాన్యం పర్యవేక్షణ జరపాల్సి ఉంటుంది. ఉద్యోగులకు, కార్మికులకు వీటిపై పూర్తి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అయితే, మానవ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలు, యంత్రాలలో లోపం, యంత్రాలను సరిగా వినియోగించకపోవడం వల్ల కూడా పేలుళ్లు జరిగే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పరికరాల లోపాలు కూడా పేలుళ్లకు కారణమే
పరిశ్రమల్లో వాడే పరికరాల్లో లోపాలు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. పాతబడిపోయిన పరికరాలు వాడటం, లేదా వాటి నిర్వహణ సరిగా ఉండకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. రియాక్టర్లు, బాయిలర్లు, పైప్‌లైన్‌లు, స్టోరేజ్ ట్యాంకుల అంతర్గత పీడనం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక పేలిపోయే ప్రమాదం ఉంది. లీకేజీలు, తుప్పుపట్టడం, పూర్తిగా అరిగిపోవడం, సరిగా నిర్వహణ పనులు లేక మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల పరికరాలు బలహీనంగా మారి అధిక ఒత్తిడి లేదా ఉష్ణోగ్రత ఏర్పడినప్పుడు అవి పేలిపోతుంటాయని నిపుణులు చెబుతున్నారు.
యంత్రాల వైఫల్యం వల్ల పేలుళ్లు జరగవచ్చు
పరిశ్రమల్లో వాడే పంపులు, కంప్రెసర్‌లు, కూలింగ్ సిస్టమ్స్ వంటి కీలక యంత్రాలు సరిగా పనిచేయకపోయినా పేలుళ్లు జరుగుతాయి. ఈ యంత్రాలు సరిగా పని చేయకపోతే నియంత్రణ కోల్పోయి పేలుళ్లు జరిగే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, సరిగా ఉందో లేదో సరి చూసుకోవాల్సి ఉంది.
సేఫ్టీ వాల్వ్‌లు పాడైనా ప్రమాదాలు
పరిశ్రమల్లో సేఫ్టీ వాల్వ్‌లు అత్యంత కీలకమైనవి. వీటిని బాయిలర్లు, రియాక్టర్లు, ప్రెషర్ వెసెల్స్, పైప్‌లైన్‌లు, రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ వంటి వాటిల్లో పీడనాన్ని తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ఇవి అధిక పీడనం వల్ల ఏర్పడే ప్రమాదాల నుండి కార్మికులను, యంత్ర సామగ్రిని కాపాడటానికి ఉపయోగపడతాయి. ఇవి ఫెయిల్ అయితే అధిక పీడనం ఏర్పడి పేలుళ్లు సంభవించే అవకాశం ఉంది.
యంత్రాల వైఫల్యాలు
పరిశ్రమలోని బాయిలర్లు, కంప్రెసర్‌లు, కూలింగ్ సిస్టమ్, రియాక్టర్లు వంటి యంత్రాలు గరిష్ట పీడనం ఎంతో అంతవరకు పని చేస్తాయి. అంతకన్నా పీడనం ఎక్కువైతే సేఫ్టీ వాల్వ్ తెరచుకోవాలి. ఇందుకోసం అవసరమైన సెన్సార్‌లు, ఇతర మెకానిజం ఏర్పాట్లతో వీటిని తయారు చేస్తారు. ఇవి ఫెయిల్ అయినప్పుడు ఆ అధిక పీడనం తట్టుకోలేక బాయిలర్లు, రియాక్టర్లు, ఇతర యంత్రాలు వాటి నిర్మాణం ఆ పీడన ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోతాయి.
విద్యుత్ లోపాలు కారణమే
పరిశ్రమల్లో విద్యుత్ లోపాల కారణంగా కూడా పేలుళ్లు జరుగుతాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్నిసార్లు అధిక విద్యుత్ ప్రవాహం జరగవచ్చు. దీని వల్ల వైర్లు కాలిపోయి మంటలు చెలరేగే అవకాశం ఉంది. ఈ మంటలు పక్కనే ఉన్న మండే అవకాశం ఉన్న రసాయన పదార్థాలు, వాయువులు లేదా ఇతర ద్రవాల డ్రమ్ములు అంటుకుని పేలే అవకాశం ఉంది. ఓవర్‌లోడింగ్, వైరింగ్ లోపాలు, పాత వైర్లు వాడటం, విద్యుత్ పరికరాలు ఫెయిల్ అవ్వడం కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటి వల్ల రసాయన పరిశ్రమల్లో, మండే స్వభావం ఉన్న ద్రవాలు, వాయువుల కారణంగా పేలుళ్లు జరిగే అవకాశం ఉంటుంది.
నిర్లక్ష్యం - తప్పిదాల కారణంగా
మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమలో భద్రతా నియమాలు, అందుకు ఏర్పాటు చేసిన ప్రమాణాలను పరిశ్రమల్లో పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. బాయిలర్లు, రియాక్టర్లు, కూలింగ్ కంప్రెసర్‌లు వంటి చోట పని చేసే కార్మికులకు సరైన శిక్షణ లేకపోవడం కూడా ప్రధాన కారణం. దీంతో పాటు, యంత్రాలు, ఇతర పరికరాలను సరిగా వినియోగించకపోవడం, పాడైతే వెంటనే మార్చకపోవడం, పరిశ్రమల్లో వాడే రసాయన పదార్థాలను ఇష్టారీతిన ఎక్కడపడితే అక్కడ నిల్వ చేయడం, రక్షణ పరికరాలు వినియోగించకపోవడం వంటి అంశాలు కూడా పరిశ్రమల్లో భారీ ప్రమాదాలకు, పేలుళ్లకు కారణంగా చెప్పవచ్చు.