Arun Reddy the person arrested in Amit Shah Fake Video Case: కేంద్ర హోం మంత్రి  అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు అరుణ్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే ఎవరు ఈ అరుణ్ రెడ్డి అన్నది అటు రాజకీయాల్లో, ఇటు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డి కొన్నాళ్లుగా సోషల్ మీడియా వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. పార్టీ విధానాలను.. తన స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అనే x ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తున్నారు. అయితే అరుణ్ రెడ్డి ఇంతకు ముందు పార్టీలో ఎలాంటి పదవులూ నిర్వర్తించలేదు. కొన్నాళ్లుగా ఆయన సోషల్ మీడియా క్యాంపెయన్ లు మాత్రమే నిర్వహిస్తున్నారు. 


రేవంత్ రెడ్డి సహా పలువురికి నోటీసులు 
రిజర్వేషన్ల విషయంలో అమిత్ షా చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా ఓ వీడియో రూపొందించారని ఢిల్లీ పోలీసులకు చెందిన ఇంటెలిజెన్స్ అండ్ స్ట్రాటజిక్  ఆపరేషన్ విభాగం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సహా పలు రాష్ట్రాల్లో వివిధ వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు రోజులుగా ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోనే ఉండి కేసు విచారణ చేస్తున్నారు. 




అరుణ్ రెడ్డి @ స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ 
ఈ విచారణ కొనసాగుతుండగానే శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీసులు అరుణ్ రెడ్డి అనే వ్యక్తిని దేశ రాజధానిలోనే అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ రెడ్డి స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అనే x ఎక్స్ అకౌంట్ ను నడుపుతున్నారు. దీనికి లక్షా 20వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. కొన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ప్రచారాన్ని ఆ పేజీ ద్వారా నిర్వహిస్తున్నారు. అయితే అరుణ్ రెడ్డి గురించి స్థానిక నాయకత్వానికి పెద్దగా తెలీయడం లేదు. ఆయన పార్టీలో ఎలాంటి పదవులు నిర్వహించలేదు. అతను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి అని.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ అనుకూల ప్రచారం ద్వారా ఏఐసీసీ సోషల్ మీడియా వింగ్ కు చేరారని స్థానిక నేతలు చెబుతున్నారు. అరుణ్ రెడ్డి తనను తాను AICC సోషల్ మీడియా విభాగానికి నేషనల్ కోఆర్జినేటర్ గా తన అకౌంట్లో చెప్పుకున్నారు. అయితే పార్టీ వర్గాలు ఆయనకు ఆ హోదా ఉందా అన్న విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడం లేదు. 





అరుణ్ రెడ్డి అయితే సోషల్ మీడియా క్యాంపెయిన్లలో చాలా ఎగ్రెసివ్ గా పాల్గొన్నారని చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలోనూ ఆయన హైదరాబాద్ నుంచి క్యాంపెయిన్ నిర్వహించారు.


రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సమయంలో అమిత్ షా వీడియో వైరల్ 
బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన సమయంలోనే అమిత్ షా వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిపై రేవంత్ తో పాటు.. పలువురికి నోటీసులు ఇచ్చారు. అయితే అమిత్ షా వీడియో పోస్టు చేసిన X అకౌంట్ తో తనకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి చెప్పారు.  రేవంత్ రెడ్డిని విచారణకు హాజరుకావాలని కోరగా.. ఆయన తరపున రేవంత్ లాయర్ హాజరై పోలీసులకు వివరణ ఇచ్చారు. నాలుగు రోజులుగా హైదరాబాద్ లో మకాం వేసిన ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఇన్ చార్జి రామచంద్రారెడ్డి కోసం వాకబు చేశారు. ఈ లోగా బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కూడా 8 మందిని అరెస్టు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న మన్నే సతీష్, విష్ణు, వంశీ, నవీన్, శివ, గీత, అస్మా తస్లీమ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.