Telangana BRS BC Politics: భారత రాష్ట్ర సమితి వ్యవహారాల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిచ్చు రేపింది. బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకు రావాలని కేబినెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం రాగానే జాగృతి అధ్యక్షురాలు కవిత సంబరాలు చేసుకున్నారు. జాగృతి పోరాటంతోనే కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చిందని రిజర్వేషన్లు ఇచ్చిందని.. ఇది తమ పోరాట ఫలితమేనని చెప్పుకొచ్చారు. కవిత సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ నిర్ణయాన్ని సమర్థించారు. 

కవిత స్పందనతో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. తాను బీఆర్ఎస్ పార్టీనేనని కవిత చెబుతున్నారు. తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని కూడా చెబుతున్నారు.  ఇటీవల ఓ మీడియా చానల్ కు ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో బీఆర్ఎస్‌కు తన కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువగా ఇచ్చానని..తాను కూడా వారసురాలినేనని స్పష్టం చేశారు.  ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై సంబరాలు చేయడం ఆసక్తి రేపింది. ఇదే బీఆర్ఎస్ విధానం అనుకుంటారేమోన్న ఆందోళనలతో వెంటనే ఇతర బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.  

ఆర్డినెన్స్ తోనే బీసీ రిజర్వేషన్లు ఎలా వస్తాయని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి నోటిఫికేషన్లు ఇస్తే.. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటాయని ... అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమవుతాయని అంటున్నారు. అధికారికంగా  42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు.  

ఓ వైపు కవిత స్వాగతించడం.. మరో వైపు బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించడం.. ఆ పార్టీలో ఉన్న గందరగోళ పరిస్థితిని మరోసారి బయట పెట్టినట్లయింది. కవిత  రాత్రికిరాత్రి సంబరాలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేసిందన్న భావన ఆ పార్టీ ముఖ్య నేతల్లో కూడా ఉంది. కానీ ఇప్పటికిప్పుడు కవిత విషయంలో ఎలాంటి చర్యలు, కామెంట్లు చేసే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదు. కవిత మాత్రం తన రాజకీయాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు.