Revanth And Chandrababu :  ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణం చేశారు. తెలంగాణలోనూ ఆరు నెలలకిందట కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు.  ఇప్పుడు అందరి దృష్టి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపైన పడింది. ఎందుకంటే.. విభజన పూర్తి అయి పదేళ్లు అయింది. ఇంకా సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి. ఈ పదేళ్లలో అన్ని విభజించి.. సమస్యలన్నీ పరిష్కారమవ్వాలన్న ఓ టైం ఫ్రేమ్‌ను విభజన చట్టంలో పెట్టారు. టైం అయిపోయింది కానీ.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. 


పదేళ్లు పూర్తయిన విభజన చట్టం - అలగే సమస్యలు                                               


విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో సమస్యలు పరిష్కరించకోవాలి. ఆస్తులు పంచుకోవాలి. ఏకాభిప్రాయం రాకపోతే కేంద్రం పరిష్కరిస్తుంది. ఈ పదేళ్ల కాలంలో కేంద్ర జోక్యం చేసుకున్నది చాలా తక్కువ. 2014 నుంచి 2019 వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ ఉన్నారు. ఆ సమయంలో రెగ్యులర్ గా రెండు రాష్ట్రాల మధ్య రాజ్ భవన్ వేదికగా చర్చలు జరిగేవి. కానీ అప్పట్లో తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి... ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య అంత సత్సంబంధాలు లేవు. అందుకే ఎవరికి వారు పట్టుబట్టి తగ్గలేదు. దాంతో సమస్యలు పరిష్కారం కాలేదు. 


గత ఐదేళ్లుగా కనీస చర్చలు శూన్యం                                 


ఆ తర్వాత ఏపీలో ప్రభుత్వం మారింది. సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయక ముందే తెలంగాణ ప్రభుత్వం కోరుకున్నట్లుగా సచివాలయ భవనాలు ఇచ్చేశారు. దానికి ప్రతిఫలంగా మరే సమస్య పరిష్కారమూ చేయలేపోయారు. ఐదేళ్ల పాటు అసలు రెండు రాష్ట్రాల మధ్య చర్చిలు కూడా జరగలేదు. తెలంగాణ నుంచి ఏపీకి కరెంట్ బకాయిలు రావాల్సి ఉందని చంద్రబాబు ప్రభుత్వం ఎన్సీఎల్టీలో .. తెలంగాణ విద్యుత్ సంస్థలపై దివాలా పిటిషన్ దాఖలు చేసింది.ర అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పిటిషన్ ఉపసంహరించుకుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం నిధులేమీ ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లింది. ఆ వివాదం కూడా హైకోర్టులో ఉంది.


ఉమ్మడి సంస్థల ఆస్తులపై ఓ క్లారిటీ వస్తే చాలు                             


ఉమ్మడి సంస్థలు విభజించారు కానీ వాటి ఉమ్మడి ఆస్తులపై మాత్రం రెండు రాష్ట్రాలు ఓ అభిప్రాయానికి రాలేపోయాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్ సమస్యకు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత పరిష్కారం చూపించారు. అదే్ పద్దతిలో మిగతా సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. అలా జరగాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావాల్సిందే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం అయినందున.. ఎన్డీఏ కూటమి సీఎంగా చంద్రబాబు ప్రమాణానికి ఆహ్వానించలేకపోయారు.