TS Rains : బంగాళాఖాతంలో ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. తెలంగాణలో ఆది, సోమ వారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఉరుములు, మెరుపులతో వర్షాలు పడవచ్చని వాతావరణ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఏపీ తీరంలో ఉన్న ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని చెప్పారు. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా పంపు తిరిగి ఉన్నదని చెప్పారు.
ఈ ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని వల్ల రానున్న మూడ్రోజుల గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆమె వివరించారు. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా అక్కెనపల్లి (పెద్దపల్లి జిల్లా), పాత మంచిర్యాలలో 9.2, వంకులం (కుమురం భీం)లో 7.3, అర్నకొండ (కరీంనగర్)లో 6.1, కారేపల్లి(ఖమ్మం)లో 5.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 3 డిగ్రీల వరకూ తగ్గడంతో చల్లని వాతావరణం ఏర్పడింది.
రాష్ట్రంలో కురిసిన వర్షాలు..!
మాగనూర్ లో 10 సెంటి మీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మధిరలో 10, గడ్డిపల్లిలో 8.7, గూడూరులో 8.1 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి సమీపంలో దోమ వాగు దాటుతూ స్థానిక రైతు జావిద్ గల్లంతయ్యారు. చాలా ఊళ్లలోని గ్రామాలు ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చాలా మంది సొంత ఇళ్లకు దూరంగా పునరావాస కేంద్రాల్లోనే ఉంటున్నారు. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికీ వరుణుడు మసురు వేస్తూనే ఉన్నాడు. చాలా మంది ఇప్పటికీ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు చాలా భయపడుతున్నారు.