Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్ గిరి, నల్గొండ, సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. అలాగే ఎల్లుండి జగిత్యాల, సిద్దిపేట, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, హైదరాబాద్ లో భారీ వర్షాలు పడబోతున్నట్లు ప్రకటించింది.


హైదరాబాద్ లో ఇలా


‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు పశ్చిమ దిశ నుంచి గాలి వేగం గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 65 శాతంగా నమోదైంది.






మరోవైపు ఏపీలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్ తెలిపారు. అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని.. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. 


ఏపీలో ఏయో రోజు ఏయే జిల్లాల్లో..


అల్లూరి సీతారామరాజు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎసస్సార్ కడప జిల్లాలో సోమవారం వర్షాలు కురవనున్నట్లు చెప్పారు. అలాగే పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాలో మంగళ వారం రోజు వర్షాలు కురవనున్నాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతా రామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్సీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీసత్య సాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో బుధవారం రోజు వర్షాలు కురవబోతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 



‘‘ఎట్టకేలకు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. జూలై 4 మధ్యాహ్నం నుంచి జూలై 7 ఉదయం మధ్యలో ఆంధ్ర​, తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడనం వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా జూలై 4, 5 న మధ్య ఆంధ్ర జిల్లాలు - బాపట్ల, ఎన్.టీ.ఆర్ (విజయవాడ తో పాటుగా), కృష్ణా, ఏలూరు, కోనసీమ​, ఏలూరు, ఉత్తర ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలతో పాటుగా కర్నూలు, నంధ్యాల​, అనకాపల్లి జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కచ్చితంగా ఉండనుంది. మిగిలిన జిల్లాలు - విశాఖ​, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మణ్యం, నెల్లూరు, తిరుపతి, కడప​, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య​, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూడగలం’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.