‘‘గంగా పశ్చిమ బెంగాల్, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ పశ్చిమ బంగాల్ తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. వరకూ విస్తరించి ఉంది. నిన్న 18°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిమీ ఎత్తు వద్ద ఉన్న షీయర్ జోన్ ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (జూలై 29) ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడాక్కడా ఎల్లుండి చాలా చోట్ల, కురిసే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికల్లాంటివి ఏమీ జారీ చేయలేదు. ఆగస్టు 1న మాత్రం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిరర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా్లలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 82 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా భారీ నుంచి అతిభారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు అన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని తెలిపారు.