ఈ నెలాఖరులోపు ఉత్తర అండమాన్‌ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇది క్రమంగా బలపడి వాయుగుండం అవుతుందని భావిస్తున్నారు. దీనికి అనుబంధంగా సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీని ఫలితంగా రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


తూర్పు కోస్తాలోని ఉమ్మడి విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని తీర ప్రాంతాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని తీర ప్రాంత జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. వర్షాల తీవ్రత తేలికపాటి నుంచి ఓ మోస్తరు వరకూ ఉంటుందని తెలిపారు.


‘‘ఈ రోజు అక్కడక్కడ మాత్రమే వర్షాలను ఆంధ్రప్రదేశ్ లో చూడగలము. ప్రస్తుతం విశాఖ నగరంలో మోస్తరు వర్షాలు తగ్గుముఖం పట్టాయి, అనకాపల్లి, గాజువాక వైపు మాత్రం కాసేపు వర్షాలు కొనసాగి తగ్గుముఖం పట్టనుంది. మరో వైపున ఈ వర్షాలు బంగాళాఖాతంలో కనిపిస్తున్న ఉపరితల ఆవర్తనానికి తేమను ఇస్తూ ఉంది. దీని వలన మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి అక్కడక్కడ మాత్రమే - కొనసీమ​, కాకినాడ​, ఎన్.టీ.ఆర్., కృష్ణా, బాపట్ల​, గుంటూరు, ఉభయ గోదావరి, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో వర్షాలను చూడగలము. అక్కడక్కడ మాత్రమే కాబట్టి మా ఇంటి మీద లేదు, మా ఊరిలో లేదు అనకండి. ఈ రోజు దక్షిణ ఆంధ్రలో తక్కువగానే వర్షాలుంటాయి.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


తెలంగాణలో వాతావరణం ఇలా..


తెలంగాణలో నేటి (నవంబరు 27) నుంచి వచ్చే ఐదు రోజుల పాటు ఎక్కడా వర్షాలు పడే సూచనలు లేవని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. వాతావరణం పొడిగానే ఉంటుందని తెలిపారు. కానీ, చలి తీవ్రత మాత్రం పెరుగుతుందని అంచనా వేశారు. తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వచ్చే రెండు రోజులు చలి మరింత పెరుగుతుందని వెల్లడించారు.


హైదరాబాద్‌లో ఇలా


‘‘హైదరాబాద్ లో క్లియర్ స్కైట్. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 17 డిగ్రీల సెంటీగ్రేడ్ గా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలివేగం గంటకు 4 కిలో మీటర్ల నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.న


వివిధ చోట్ల చలి ఇలా..


నిన్న తెలంగాణలోని వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో విపరీతమైన చలి ఉంటోందని తెలిపారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లోనూ కనిష్ణ ఉష్ణోగ్రత 11 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతోంది. ఈ జిల్లాలకు పసుపు రంగు అలర్ట్ జారీ చేశారు. 


నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కనిష్ణ ఉష్ణో్గ్రతలు 15 డిగ్రీలకు మించి నమోదవుతుండడంతో ఇక్కడ ఎలాంటి అలర్ట్ లు జారీ చేయలేదు.