సెప్టెంబర్ 25 న నైరుతి రుతుపవనాల ప్రభావం (Withdrawal) నైరుతి రాజస్థాన్ నుండి ప్రారంభమైందని.. సాధారణంగా ఈ పరిణామం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి మొదలు కావల్సి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు ద్రోణి నైరుతి ఉత్తరప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ రోజు ఆవర్తనం దక్షిణ చత్తీస్ గఢ్, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ నుండి 5.8 కి మీ మధ్యలో కొనసాగుతుందని తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast)
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.3 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 86 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
‘‘ఉత్తరప్రదేశ్ మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడి నేరుగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల మీదుగా ఒక బలమైన ఉపరితల ఆవర్తనంగా రానుంది. అది మరో మూడు నుంచి నాలుగు రోజులు మన మీదుగానే వెళ్లనుంది. ఈ నాలుగు రోజులు వర్షాలు పుష్కలంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, వై.యస్.ఆర్. జిల్లాల్లో భారీ నుంచి అతిభారీగా వర్షాలు ఉంటాయి. తెల్లవారి నుంచి సాయంకాలం వరకు వేడి వాతావరణానికి భిన్నంగా రాత్రులు ఉంటుంది.
మరో వైపున అనంతపురం జిల్లా, సత్యసాయి, కర్నూలు, నంధ్యాల, ప్రకాశం జిల్లాల్లో రాత్రి లేదా అర్ధరాత్రి వర్షాలను చూడగలము, కానీ ఈ ప్రాంతాల్లో చెదురుముదురుగానే ఉంటుంది. మరో వైపున పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్.టీ.ఆర్., ఉభయ గోదావరి, కృష్ణా, కొనసీమ, కాకినాడ జిల్లాల్లో మధ్యాహ్నం - సాయంకాలం ఒక విడత, అలాగే అర్ధరాత్రి నుంచి తెల్లవారిజామున వరకు మరో విడతలో వర్షాలుంటాయి. తెలంగాణ నుంచి బలమైన వర్షాలు నేరుగా ఎన్.టీ.ఆర్., ఏలూరు జిల్లాల మీదుగా ఉంటుంది కాబట్టి కాస్త వర్షాల జోరు మధ్యాంధ్రలోనే ఈ జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. నేడు రాత్రి వర్షాలు తప్పిన చోట్లల్లో ఈ నాలుగు రోజుల్లో పడే అవకాశాలుంటాయి. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో - విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ సాయంకాలం । రాత్రి సమయాల్లో ఉంటుంది. అర్ధరాత్రికి ఈ వర్షాలు తగ్గుముఖం పడతాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.