ఈ రోజు ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లాలోని ఒడిశా తీరంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకి వంగి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ఆవర్తన ప్రభావం వల్ల రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.


మరొక ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ ఘడ్ మీద కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉంది. షీయర్ జోన్ (అల్పపీడనం ద్రోణి ) 18°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు వరకు కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉందని అధికారులు వివరించారు.


ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల రాగల మూడు రోజులు  తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు  అనేక చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఈ రోజు అత్యంత భారీ వర్షాలు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాలతో పాటు  అతి భారీ  వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కొన్నిచోట్ల తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 27 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 10 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 95 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 


నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో బుధవారం (జూలై 18) అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. 


ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.