ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.


‘‘మహా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో మార్చి 15 సాయంత్రం అల్ప పీడనం ఏర్పడింది. ఇది మార్చి 16న దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ఉంది. ఇది తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దాని చుట్టూ ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ 19వ తేదీ ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మొదట్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. మార్చి 22 వరకూ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదిలి, మార్చి 23 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి గాలులు వీస్తున్నాయి.






వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల వరకూ వాతావరణ సూచన ఇలా ఉండనుంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుంది.’’ అని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. 


‘‘కోస్తాంధ్ర​, తూర్పు తెలంగాణ​, ఉత్తర తెలంగాణలో వడగాల్పులు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో 43 డిగ్రీల దాక ఉష్ణోగ్రతలు వెళ్తున్నాయి. వేడి విపరీతంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఖమ్మం, సూర్యాపేట​, నల్గొండ జిల్లాల మీదుగా ఉంది. మరో రెండు గంటలపాటు ఈ తీవ్రత కొనసగుతుంది. హైదరాబాద్ లో కూడ 39 డిగ్రీలు నమోదవుతోంది ప్రస్తుతం. దయజేసి ఇంట్లో ఉండటం, ఒక చల్లటి ప్రదేశంలో ఉండటం మంచిది. నీరు ఎప్పటికప్పుడు తాగుతూ ఉండండి.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సూచించారు.



తెలంగాణలో ఇలా.. (Telangana Weather Update)
తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట​, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటుతున్నాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఏకంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ అధికారులు వెల్లడించారు.