నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నేడు ఉదయం 5:30 కి అదే ప్రదేశంలో మోచా తుపానుగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తుపాను సుమారుగా ఉత్తర - వాయవ్య దిశ వైపుగా కదులుతూ క్రమంగా బలపడి ఈ రోజు రాత్రికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. తరువాత తన దిశను మార్చుకొని ఉత్తర - ఈశాన్య దిశగా కదులుతూ క్రమంగా బలపడుతూ 12వ తారీకు ఉదయానికి, మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలపడుతూ 13వ తేదీ సాయంత్రానికి బాగా బలపడే అవకాశం ఉంది. ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ తీరాల మధ్యలో Cox's Bazar (బంగ్లాదేశ్) & kyaukpyu (మయన్మార్) మధ్యలో సిట్ట్వె (SITTWE)కి అతి సమీపంలో 14వ తేదీ మధ్యాహ్నం గాలి వేగం 140-150 కి.మీ. (maxwind 165 కి మీ) తో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.
దీని ప్రభావం వలన రాగల మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలో కొన్ని చోట్ల సుమారుగా 41 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 37 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.
తెలంగాణపై ఎఫెక్ట్ ఇలా
దీని ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి రాష్ట్రంలో కొన్ని చోట్ల సుమారుగా 41 డిగ్రీల నుండి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సుమారుగా 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 59 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.