Telangana Weather Updates: కొన్ని రోజుల కిందటి వరకు ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో చలి ప్రభావం తగ్గతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి చలిగాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, చలి తీవ్రత తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. జంగమేశ్వరపురంలో అత్యల్పంగా 16.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్లోల 16.7 డిగ్రీలు, నందిగామలో 18.6 డిగ్రీలు, విశాఖపట్నంలో 18.8, గన్నవరంలో 19.8 డిగ్రీల మేర వకనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చునని వాతావరణ కేంద్రం పేర్కొంది.  కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణం కాస్త వేడిగా మారనుంది. వర్ష సూచన లేకపోవడంతో రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందవద్దని అధికారులు పేర్కొన్నారు.






దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అనూహ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల తగ్గాయి. ఆరోగ్యవరంలో ఏకంగా 14.5 డిగ్రీలకు తగ్గింది. అనంపురంలో 16.6 డిగ్రీలు, నంద్యాలలో 18.6 డిగ్రీలు, తిరుపతిలో 19.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి.


తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలు, వాటి చుట్టుపక్కల జిల్లాలో  పలు చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్ష ప్రభావం లేని చోట కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.