YS Sharmila criticises Telangana cm KCR: వరంగల్: ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఏం చేశారంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర వరంగల్ లో కొనసాగుతోంది. ప్రజా ప్రస్థాన పాదయాత్ర 3300 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు నీటి మీద రాతలే
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేర్చలేదని షర్మిల ఆరోపించారు. కేజీ టూ పీజీ, ఉచిత విద్య హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. పోడు రైతుల సమస్యలు కూడా పరిష్కరించకుండా అలాగే ఉన్నాయన్నారు. రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ షర్మిల మండిపడ్డారు. బంగారు తెలంగాణ అని చెప్పి.. బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ చేసిండన్నారు


పరకాల నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న పాదయాత్ర
 వైఎస్ షర్మిల పర్యటనలో భాగంగా  పరకాల నియోజకవర్గంలోని నర్సక్కపల్లి గ్రామంలో పాదయాత్ర కొనసాగుతుంది. గ్రామ ప్రజలు వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఅర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు.. ఇది దొరలు ఏలుతున్న.. దొంగల ప్రభుత్వం అన్నారు. ఇది దోపిడీ రాజ్యం, ఇది గూండాల, రౌడీల రాజ్యం అంటూ విమర్శించారు. కూటి కోసం పనిచేసే పోలీసులను, హక్కులు లేని జీతగాళ్ళులా వాడుకుని ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు ఓటుతో పోటు వేసి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే పరిపాలన చేస్తున్నారన్నారు. 


బంగారు తెలంగాణలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
బంగారు తెలంగాణలో పేద ప్రజలకు బ్రతుకే లేని తెలంగాణ అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటివరకూ ఏ వర్గాన్ని ఆదుకొనే దిక్కు లేదు, రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇచ్చే దిక్కు లేదంటూ మాటలు ఎక్కు పెట్టారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చనిపోతుంటే, వారి ఆత్మహత్యలకు కారణాలు తెలిసి కూడా ఆపడం చేతకాని ప్రభుత్వం తెలంగాణాలో ఉందన్నారు. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని డిపాజిట్లు గల్లంతు అయ్యేలా ఓడించి ప్రతి ఒక్క టీఆర్ఎస్ నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.






తెలంగాణ రాష్ట్రంలో మాటమీద నిలబడే నాయకులే లేరని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. హన్మకొండ జిల్లా ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నడికూడా, పరకాల మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో భాగంగా షర్మిల కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రజల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రైతుల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి భద్రంగా ఉన్నారన్నారు. రైతులకు రుణమాఫీ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు గెలిచిన ఉపయోగం లేదని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలని తెలిపారు.