Vikarabad Accident: వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతగిరి చివరి ఘాట్ లో జైలు పల్లి రోడ్డు సమీపంలో వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే మరో 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులు, అంబులెన్స్ కు సమాచారం అందించారు. అయితే హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే క్షతగాత్రులందరినీ స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అంతే కాకుండా చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు.. థరూర్ జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. 


సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..


సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున ఇస్నాపూర్‌ వద్ద ఆగి ఉన్న బస్సును ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కరు దుర్మరణం చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతే కాకుండా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ర్కారు ఆసుపత్రికి తరలించారు. 


కడపలో ఆటో లారీ ఢీ - ముగ్గురు మృతి


కడప - తాడిపత్రి ప్రధాన రహదారిలోని చెన్నారెడ్డిపల్లె సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. సీఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పొట్లదుర్తి గ్రామానికి చెందిన భార్య భర్తలైన సిరంగి దస్తగిరి (45), సిరంగి సరస్వతి (35) అనారోగ్యం కారణంగా వైద్యం కోసం ఆటోలో కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామానికి వెళ్లారు. తిరిగి పోట్లదుర్తి గ్రామానికి వస్తుండగా ముద్దనూరు వద్దకు రాగానే తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. ప్రమాదంలో దస్తగిరి, సరస్వతి అక్కడిక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ పట్నం ప్రేమ్ కుమార్ తీవ్ర గాయాలు అయ్యాయి. 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సీఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ చంద్ర మోహన్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.