YS Sharmila: తెలంగాణలో అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. మంచిర్యాల జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ముల్కల్ల వద్ద రైతుల కోరిక మేరకు షర్మిల ఎడ్లబండిని రైతుతో కలిసి తోలారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చాక రైతుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తామని, వ్యవసాయాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు వైఎస్సార్ పెద్ద పీట వేశారని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 2లక్షల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారని గుర్తు చేశారు. గూడెం లిఫ్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారని తెలిపారు.
వైఎస్సార్ ఇంత చేస్తే కేసీఆర్ చేసింది ఏంటి..?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంత చేస్తే సీఎం కేసీఆర్ చేసిందేమిటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ డిజైన్ చేసి ఈ జిల్లాకు అన్యాయం చేశారన్నారు. తమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే అదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదన్నారు. సీఎం కేసీఅర్ కనీసం ఒక్క ఎకరాకు కూడా సాగు నీరు ఇవ్వలేక పోయారని ఆరోపించారు. అయినా తమ్మిడి హట్టి చేస్తా అన్నారని, తట్టెడు మట్టి కూడా తీయలేదని చెప్పుకొచ్చారు. వార్ధా ప్రాజెక్ట్ పూర్తి చేసినా లక్ష ఎకరాలకు సాగు నీరు వచ్చేదని.. ఇప్పటి వరకు ఎందుకు కట్టలేక పోయారని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా సింగరేణి జిల్లా అని, అండర్ గ్రౌండ్ బొగ్గు బావులు తవ్వుతానన్నారని... ఓపెన్ కాస్ట్ బంద్ అన్నారన్నారు. సింగరేణి ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణానికి 10 లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయారన్నారు. వైఎస్సార్ హయాంలో సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులను సైతం మోసం చేశారన్నారు.
ఈ జిల్లాలో వైఎస్ఆర్ హయాంలో 30 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని షర్మిల తెలిపారు. ఇప్పుడు కేసీఅర్ పట్టాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. పోడు పట్టాలపై అడిగితే మహిళలు అని చూడకుండా జైల్లో పెట్టారన్నారు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని కేసీఅర్ ముఖ్యమంత్రిగా ఎందుకు ఉన్నట్లు అని ఆమె ప్రశ్నించారు. ఈ యంత్రాంగం ఎందుకు ఉన్నట్లు, ఈ మంత్రులు ఎందుకు ఉన్నట్లని అడిగారు.
పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటన
రాజకీయంగా పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో ప్రకటించారు. ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ జనరల్ స్థానం. అలాగే ఇక్కడ సామాజిక సమీకరణాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో వైఎస్సార్ అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అందువల్ల ఆమె పాలేరు నుంచి పోటీ చేయబోతున్నారు. షర్మిల పార్టీకి తెలంగాణలో ఆదరణ లభిస్తుందా లేదా అన్నదానిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. షర్మిల రాజకీయంగా ప్రధాన స్రవంతిలోకి ఇంకా రాలేదని అంచనా వేస్తున్నారు.