వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ మృతిచెందారు. గుండెపోటుతో ఏ.ఐ.జీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు బానోత్ మదన్ లాల్. ఆ తరువాత బిఆర్ఎస్ లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేసినా విజయం దక్కలేదు. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయారు మదన్ లాల్. ఆయన ప్రస్తుతం బిఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్నారు. పార్టీ నేత మృతిపై బీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి..

సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అద్భుతమైన విజయాన్ని సాధించారు బానోతు మదన్ లాల్. ఈర్లపూడి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన మదన్‌లాల్ తన నాయకత్వంతో ప్రశంసలు అందుకున్నారు. ఎంపీటీసీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన పొలిటికల్ కెరీర్ కొనసాగింది. వామపక్ష మూలాలున్న మదన్‌లాల్ విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. దాంతో పాలిటిక్స్ లోకి వచ్చి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. 

2014లో మదన్ లాల్ YSRCP నుంచి పోటీచేసి MLAగా విజయం సాధించారు. అది ఆయన రాజకీయ జీవితంలో అతిపెద్ద విజయం. అనంతరం ఆయన BRS పార్టీలో చేరారు. కానీ 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి, ప్రస్తుత వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ చేతిలో ఓటమి ఎదుక్కొన్నారు. రాములు నాయక్ తరువాత BRS పార్టీలో చేరారు. 

BRS పార్టీ రాములు నాయక్‌కు బదులుగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ విధేయుడు అయిన బానోతు మదన్ లాల్‌ను బరిలోకి దించింది. తనకు BRS అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఖమ్మంలో కాంగ్రెస్ వైపు గాలి మళ్లడంతో వరుసగా రెండోసారి మదన్ లాల్ ఓటమి చెందారు. తన విజయంపై ఎటువంటి సందేహం లేదని, భారీ మెజారిటీ వస్తుందని భావించిన మదన్‌లాల్ కు ఈ  ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది.