వరంగల్‌లో ఇద్దరు వ్యక్తులు వేధించడంతో అవమానం భరించలేక ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో ఇద్దరు ఏకకాలంతో తనను వేధించడంతో మనస్తాపానికి లోనై బలవన్మరణం చెందింది.  హనుమకొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఏఆర్‌ విభాగంలో పని చేస్తున్నారు. ఆమెను దూరపు బంధువైన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్‌ పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. కానీ ఆమె డ్యూటీలో ఉండగా వీడియో కాల్‌ చేయమంటూ, వేరే ఎవరితోనో మాట్లాడుతున్నావు అంటూ తరచూ అనుమానిస్తూ వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక అనిత తన తల్లిదండ్రులకు చెప్పగా, వారు రాజేందర్‌ పద్ధతి నచ్చక తమ కూతురిని అతడికి ఇచ్చి పెళ్లి చేయడం కుదరదని తెగేసి చెప్పారు. అయినా రాజేందర్‌ ఆమెను బతిమాలుతూ వేధిస్తూనే ఉన్నాడు.

మరోవైపు అనిత తన క్లాస్‌మేట్‌ జబ్బార్‌లాల్‌తో చనువుగా ఉండటం, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం రాజేందర్‌కు తెలిసింది. దీంతో కోపంతో జబ్బార్‌కు ఫోన్‌ చేసి అనిత గురించి చెడుగా చెప్పాడు. అది నమ్మిన జబ్బార్‌ కూడా కానిస్టేబుల్ అనితను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఒకేసారి ఇద్దరు తనను వేధిస్తుండటం, అనుమానించడాన్ని అవమానంగా భావించింది. ఈ క్రమంలో ఆందోళనకు గురైన అనిత ఈ నెల 27న రాజేందర్‌కు ఫోన్‌ చేసి నువ్వు, జబ్బార్‌ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. మీవల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పింది. అయితే రాజేందర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చావమని సమాధానం చెప్పాడు.

ఇది అవమానంగా భావించిన అనిత గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు రాజేందర్, అతడి కుటుంబ సభ్యులు, జబ్బార్‌పై గురువారం కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ అనిత మృతికి కారణాలపై విచారణ చేపట్టారు.