మాట ఇచ్చారు..ముందుకొచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. నిన్నటివరకు దూరదూరంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఒక్కసారి అంతా నేనే అనే తీరుగా వ్యవహరిస్తున్నారు. దీనంతటికి కారణం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు ఇచ్చిన మాటే అంటున్నారు. ఇంతకీ బీఆర్‌ఎస్ అధినేత ఏం భరోసా ఇచ్చారు? తుమ్మలలో ఎందుకంత ఉత్సాహం వచ్చింది అని ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం జిల్లా చుట్టూ ప్రత్యేక రాజకీయాలు నడుస్తున్నాయి. ఈనెల 18న జరగనున్న బీఆర్‌ఎస్ నిర్వహించనున్న సభని విజయవంతం చేసేందుకు ఆపార్టీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలోని అసంతృప్త నేతలను చల్లబరిచే ప్రయత్నాలు చేస్తోంది. ఈ కోవలోనే సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుని కూడా శాంతింప చేసేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయినట్లు కనిపిస్తోంది.
హరీష్ రావు సమస్యను పరిష్కరించారా? తుమ్మలకు టిక్కెట్ కన్ఫామా?
ఇంతకీ తుమ్మల మళ్లీ యాక్టివ్ అవ్వడానికి కారణం ఏంటి ? మంత్రి హరీష్ రావు మంతనాలు పనిచేశాయా, లేదంటే బీఆర్ ఎస్ అధినేత కెసిఆర్ ఇచ్చిన మాటతో తుమ్మలలో జోష్ వచ్చిందా అన్న చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా వర్గ పోరుతో ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు. జిల్లా రాజకీయాలతోనే కాకుండా కేసీఆర్ తోనూ అంటీముట్టనట్టుగానే ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే జిల్లాలో కీలకనేత అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధిక్కారస్వరం వినిపిస్తున్నా ఆయనను పట్టించుకోని కెసిఆర్ అండ్ టీమ్ తుమ్మలని కూడా పక్కన పెట్టేస్తుందనుకుంటున్న టైమ్ లో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు రంగంలోకి దిగారు. స్వయానా తుమ్ముల ఇంటికి వచ్చి మరీ చాలా సేపు ముచ్చటించారు. ఆ తర్వాత తుమ్మల .. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హైదరాబాద్ రావడం, కేటీఆర్ మామ దశదిశకర్మకు హాజరుకావడం వంటి పరిణామాలు చకాచకా జరిగాయి. ఈ భేటీలో ఏం జరిగిందన్నది తుమ్మల ఇప్పటివరకు బయటకు చెప్పలేదు. అయితే పలు కథనాలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో తుమ్మల కోరుకున్న నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు కెసిఆర్ అంగీకరించారట. కమ్యూనిస్ట్ లతో పొత్తులు ఉన్నా , సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీటు అన్న మాటని పక్కన పెట్టి తుమ్మల కోరిన విధంగా పాలేరు సీటు ఇచ్చేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారనే టాక్ నడుస్తోంది. ఈ మేరకు భరోసా ఇవ్వడంతో తుమ్మలు మళ్లీ బీఆర్ ఎస్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. అందుకే ఆవిర్భావ సన్నాహక సభలో ఉత్సాహంతో పాటు ఊపులోనూ కనిపించారన్న టాక్ వినిపిస్తోంది. సీటు విషయమే కాదు సీనియార్టీని కూడా గుర్తించి ఇక నుంచి జిల్లా రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ సూచించారట. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేడర్ ని సిద్ధం చేయాల్సిన బాధ్యతతో పాటు గెలుపు గుర్రాలను సిద్ధం చేయాలని తుమ్మలకు దిశానిర్దేశం చేశారట. దీంతో ఆవిర్భావ సభని తన భుజాలకెత్తుకోవడమే కాదు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం ఏంటో చూపించి మరోసారి తన సత్తా ఏంటో జిల్లా నేతలకే కాదు కేసీఆర్ కి కూడా చూపించాలని భావిస్తున్నారట.
నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తారా? లేదా సీన్ రీపీట్ అవుతుందా?
తుమ్మల మళ్లీ యాక్టివ్ కావడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే గతంలో కూడా అనేక మీటింగ్స్ జరిగాయి. ఎన్నిసార్లు సఖ్యతగా ఉండాలని జిల్లానేతలకు కేసిఆర్ స్వయంగా సూచించారు. కానీ అప్పటికప్పుడు మాత్రమే ఈ మాటలు పనిచేస్తున్నాయి. జిల్లాలో పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధిరెడ్డి, జలగం వెంకట్రావ్, సండ్ర వెంకట వీరయ్య, కందాళ ప్రభాకర్ రెడ్డి, మదన్ లాల్, రాముల్ నాయక్, రేగా కాంతారావు, తాటి వెంకటేశ్వర్లు ఇలా అందర్ని ఒక్కతాటిపై తీసుకొస్తే బీఆర్‌ఎస్ గెలుపు సాధ్యం కానీ, నేతల మద్య పొరపొచ్చాలే జిల్లాలో పార్టీకి చేటు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఈనెల 18న జరిగే మీటింగ్ తర్వాత అయినా అందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకుతీసుకు వెళ్తారా లేదా అనేది చూడాలి. అందులోనూ ఈ సారి కమ్యునిస్టులతో పొత్తు ఉండే అవకాశాలు దాదాపు ఉన్నాయి. జిల్లాలో కనీసం మూడు నుంచి నాలుగు సీట్లు వామపక్షాలకు ఇవ్వాల్సి ఉంటుందనే టాక్ నడుస్తోంది. మరి టైం నేతల మద్య సఖ్యత ఏ మేరకు ఉంటుందో చూడాలి.