- వ‌డ‌గండ్ల బాధితుల‌కు ప్రభుత్వం అండ‌గా ఉంటుంది
- ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాల క‌లెక్టర్లతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు
- వెంట‌నే న‌ష్టాల‌ను అంచ‌నా వేయాల‌ని అధికారుల‌కు ఆదేశాలు
- వ‌డగండ్ల వాన‌పై మంత్రి ఎర్రబెల్లి ఆరా!
- సీఎం కేసీఆర్ తో మాట్లాడి, ప్రభుత్వ ప‌రంగా ప‌రిహారం అందిస్తాం
- ధైర్యంగా ఉండాల‌ని రైతుల‌కు మంత్రి భ‌రోసా


వరంగల్: ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాతోపాటు, జ‌న‌గామ జిల్లాలో కురిసిన వ‌డ‌గండ్ల వాన‌కు జ‌రిగి భారీ న‌ష్టాల‌ను వెంట‌నే రేపు రంగంలోకి దిగి అంచ‌నా వేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు జిల్లా క‌లెక్టర్లను, సంబంధిత శాఖ‌ల అధికారులు ఆదేశించారు. ఈ మేర‌కు మంత్రి ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప‌రిధిలోని అన్ని జిల్లాల క‌లెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు. ఏయే చోట్ల వ‌డ‌గండ్లు కురిసాయి? ఏ మేర‌కు ఏయే పంట‌లు న‌ష్టాల‌కు గుర‌య్యాయి. ఎంత మంది రైతులు న‌ష్టపోయే అవ‌కాశం ఉంది? పంట న‌ష్టాలు ఎన్ని ఎక‌రాల్లో? ఎంత మేర‌కు న‌ష్టపోయాయ‌నే విష‌యాల‌పై మంత్రి జిల్లాల క‌లెక్టర్లు, వ్యవ‌సాయ అధికారుల‌తో మాట్లాడి ఆరా తీశారు. 


అనంత‌రం మీడియాకు ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేశారు.  సాయంత్రం భారీగా గాలులు వీస్తూ కురిసిన వ‌డ‌గండ్ల వాన రైతాంగానికి తీవ్ర న‌ష్టాన్ని క‌లిగించింద‌ని మంత్రి విచారం వ్యక్తం చేశారు. వ‌డ‌గండ్ల వానల‌కు న‌ష్టపోయిన రైతాంగం ధైర్యంగా ఉండాల‌ని చెప్పారు. సిఎం కెసిఆర్ తో మాట్లాడాన‌ని, పంట న‌ష్టాల అంచ‌నాలు వేశాక‌, త‌గిన విధంగ ప‌రిహారం అందేలా చూస్తామ‌ని మంత్రి తెలిపారు. అధికారులు వెంట‌నే రంగంలోకి దిగి, పంట న‌ష్టాల అంచానాలు వేయ‌డంతోపాటు, రైతుల‌కు ధైర్యం చెప్పాల‌ని సూచించారు.


అల్పపీడన ద్రోణి / గాలిలోని అనిచ్చితి తెలంగాణ నుండి రాయలసీమ మీదగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టంకి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు  42 నుండి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన  అనేక చోట్ల, కొన్నిచోట్ల 43 డిగ్రీల కన్నా ఎక్కువ అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశం ఉంది. 


తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి  గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు  41 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెంటీగ్రేడ్  మధ్యన అనేక చోట్ల, రేపు 40 డిగ్రీల నుండి 42 డిగ్రీలు దకొన్ని చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ ఎండల విషయంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


శుక్రవారం నుంచి 4, 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు, గణనీయంగా తగ్గి  అనేక చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. GHMC పరిధిలో  21 వ తేదీ నుండి 35 డిగ్రీల నుండి 37 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది.  ఈరోజు, వాయువ్య తెలంగాణ, రేపు తూర్పు తెలంగాణ జిల్లాలలో, ఉరుములు మెరుపులతో పాటు ఈదురు గాలులు ( గాలి  గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో) వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.