వరంగల్: పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసేందుకు తీసుకొచ్చిన సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ (CEIR PORTAL) ప్రభావం చూపుతోంది. CEIR PORTAL సహాయంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీసులు పోగొట్టుకున్న సెల్ ఫోనును తక్కువ సమయంలో రికవరీ చేశారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి పోలీసులు రికవరీ చేసి అప్పగించారు.
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రాకేష్, కాటారంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గోదావరిఖని వెళుతుండగా మార్గ మధ్యలో సెల్ ఫోన్ మిస్సవ్వగా, బాధితుడు CEIR PORTAL ద్వారా సెల్ ఫోన్ నెంబర్ను www.ceir.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు నమోదు చేశారు. అయితే సంబంధిత సెల్ ఫోన్ ను గంటల వ్యవధిలో కాటారం పోలీసులు శుక్రవారం రికవరీ చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జె. సురేందర్ రెడ్డి బాధితుడు రాకేశ్ కు రికవరీ చేసిన అతడి సెల్ ఫోన్ తిరిగి ఇచ్చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు తమ సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు CEIR PORTAL ద్వారా మొబైల్ కు సంబధిత వివరాలు www.ceir.gov.in వెబ్ సైటుకు వెళ్లి అందులో వివరాలు పూర్తిగా పొందుపరచాలని సూచించారు. అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ ను టెక్నాలజీ సాయంతో రికవరీ చేసి బాధితులకు వారి ఫోన్ ను అందజేస్తాం అన్నారు. ఈ సాంకేతికతను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పి వేముల శ్రీనివాసులు, కాటారం డిఎస్పీ జి. రామ్ మోహన్ రెడ్డి, సిఐ రంజిత్ రావు, ఎస్ఐ శ్రీనివాస్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
CEIR యాప్ ఎలా పనిచేస్తుంది
టెలికాం మంత్రిత్వ శాఖ సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR ) యాప్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in వెబ్ సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. పోయిన ఫోన్ లోని నంబర్లు, ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడీ, ఓటీపీ (OTP) కోసం మరో ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. ఫోన్ దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. ఫోన్ పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించాలని, CEIR యాప్ సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. CEIR యాప్ లో సమాచారం నమోదు చేస్తే పోయిన మొబైల్ ఫోన్ త్వరగా దొరకడానికి అవకాశం ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.