Crime News: వివాహేతర సంబంధాలు కుటుంభాలను నాశనం చేస్తున్నాయి. భర్తను భార్య చంపడం, భార్యను భర్త చంపడం దాని వల్ల పిల్లలు అనాథ కావడం ఈ మధ్య కాలంలో చాలా కేసుల్లో కనిపిస్తోంది. ప్రియుడితో కలిసి అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించిన భార్య అనే వార్తలు ఈ మధ్య చాలా వినిపిస్తున్నాయి. కట్టుకున్న భర్తను కాదని, పుట్టిన పిల్లలకు కాదని ప్రియుడి వెంట పడుతూ విచక్షణ కోల్పోతున్నారు. ప్రియుడే కావాలని అడ్డుగా ఉన్న కట్టుకున్న భర్తను, నవమాసాలు మోసి కన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. భర్తను, బిడ్డలను చంపితే జైలుకు వెళ్తాం.. జైలుకు వెళ్లాక ఇక సుఖం ఎక్కడిది అన్న ఆలోచన చేయడం లేదు. తాత్కాలికంగా ఉండే సుఖాల కోసం హంతకులు అవుతున్నారు. 


అలాంటి మరో ఘటన వెలుగుచూసింది. ఈ మహా ఇల్లాలు కట్టుకున్న భర్తను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ మూడేళ్ల చిన్నారి.. వాంగ్మూలంతో అసలు విషయం బయటకు వచ్చింది. 


చిన్నారి వాంగ్మూలంతో వెలుగులోకి హత్యాకాండ..


జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మాంతపురం గ్రామ పరిధిలోని తీటుకుంటతండాకు చెందిన లకావత్ కొమ్రెల్లి, భారతికి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారు ఆరేళ్ల క్రితం సికింద్రాబాద్ కు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. నామాలగుండలో జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఇద్దరిని జనగామలోని ఎస్టీ వసతి గృహంలో చేర్చించారు. మూడున్నరేళ్ల చిన్నారితో కలిసి సికింద్రాబాద్ లోనే నివాసం ఉంటున్నారు.


రెండేళ్ల క్రితం బంధువుల వివాహ వేడుకల కోసం వెళ్లగా అక్కడ జనగామ జిల్లా అడవికేశవపురానికి చెందిన డీజే ఆపరేటర్ బానోత్ ప్రవీణ్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. లకావత్ కొమ్రెల్లికి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చింది. గట్టిగా నిలదీశాడు. దీంతో భర్త అడ్డుగా ఉన్నాడని భారతి భావించింది. భర్తను చంపితే తాము సుఖంగా బతకొచ్చు అనుకుంది. ఈ సమయంలోనే సొంతూరుకు వెళ్తున్నానని చెప్పి లకావత్ కొమ్రెల్లి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇంట్లో భర్త లేకపోవడంతో ప్రియుడిని పిలిపించుకుంది భారతి.


వంతెన పైనుంచి శవాన్ని కిందకు పడేశారు..


ఊరికి వెళ్తున్నానని చెప్పిన కొమ్రెల్లి అదే రోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు వచ్చేసరికి భార్య, తన ప్రియుడితో కలిసి అత్యంత సాన్నిహిత్యంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. వారితో గొడవకు దిగాడు. ఇదే సరైన సమయంగా భావించిన భారతి... ప్రియుడిని ఉసిగొల్పింది. ఇద్దరూ కలిసి చున్నీని కొమ్రెల్లి మెడకు చుట్టారు. ఇద్దరూ కలిసి కొమ్రెల్లిని గట్టిగా పట్టుకుని చున్నీతో గొంతు నులిమి చంపేశారు. తర్వాత దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు కొమ్రెల్లి శవాన్ని తీసుకువెళ్లి భువనగిరి మండలం అనంతారం సమీపంలో వంతెనపై నుంచి కిందకు తోసేశారు.


కొమ్రెల్లికి పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో వైద్యులకు అనుమానం వచ్చి అదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలు పెట్టారు. హత్య సమయంలో భారతి వద్దే ఉన్న మూడున్నరేళ్ల చిన్నారిని విచారించగా.. ఆ చిన్నారి వచ్చీరానీ మాటలతో అసలు విషయాన్ని చెప్పింది. అంకుల్‌తో కలిసి నాన్న మెడకు ‌అమ్మ చున్నీ కట్టారని చెప్పింది. అంతే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.