Traffic Constable saves a man life by performing CPR:
వరంగల్: సీపీఆర్ శిక్షణ మెరుగైన ఫలితాలు ఇస్తోంది. ప్రమాదవశాత్తూ గుండెపోటుకు గురైన వారిలో కొందరు ప్రాణాలతో బయట పడుతున్నారు. తాజాగా వరంగల్ హన్మకొండలో ఓ వ్యక్తికి సీపీఆర్ చేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ వ్యక్తి ప్రాణాల్ని కాపాడాడు. బైక్‌ పై వెళ్తూ రేషన్‌ డీలర్‌ కుప్పకూలిపోగా, అది గమనించిన ట్రాఫిక్ పోలీస్ సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. సమయానికి స్పందించి ఓ వ్యక్తి ప్రాణాల్ని కాపాడిన ట్రాఫిక్ పోలీస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.


అసలేం జరిగిందంటే.. 
హన్మకొండకు చెందిన రాజు రేషన్ డీలర్ గా ఉన్నాడు. అతడు పనిమీద బైక్‌పై వెళ్తుండగా ఛాతీలో నొప్పి రావడంతో అలంకార్ జంక్షన్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాధితుడ్ని సాయం చేశారు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ స్వామి రేషన్ డీలర్ రాజు పరిస్థితిని గమనించి వెంటనే సీపీఆర్ చేశాడు. కొంతసేపు సీపీఆర్ చేయడంతో రాజు కొంచెం కోలుకున్నట్లు కనిపించాడు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తర‌లించాడు. అప్పటికే సీపీఆర్ చేయడంతో రాజుకు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పారు. 


ట్రాఫిక్ కానిస్టేబుల్ కు సీపీ అభినందనలు
సీపీఆర్‌ ద్వారా రేషన్ డీలర్ రాజు ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ స్వామిని వరంగల్ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అభినందించారు. CPR పట్ల పోలీస్ సిబ్బందికి సీపీ ఇప్పించిన శిక్షణ సత్ఫలితాలు ఇస్తుండడంతో ప్రశంసలు కురిపించారు. చొరవ తీసుకుని సకాలంలో సీపీఆర్ ద్వారా వ్యక్తి ప్రాణాలు కాపాడిన స్వామిని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్, హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ రవి కుమార్ లు సైతం అభినందించారు. ఒకరి ప్రాణం కాపాడి పోలీసుల ప్రతిష్టను పెంచారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సీపీఆర్ శిక్షణ ఇప్పించడం వల్లే నిండు ప్రాణాన్ని కాపాడే వీలు కలిగిందన్నారు.


మార్చి నెలలో భూపాలపల్లి జిల్లాలో.. 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ చికెన్ సెంటర్ ఉంది. అక్కడే వంశీ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అయితే ఉదయం పని నిమిత్తం చికెన్ సెంటర్ కు వచ్చిన అతడికి గుండెపోటు వచ్చింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా పడిపోయాడు. అయితే పక్కనే ఉన్న బ్లూ కోల్డ్ పోలీస్ సిబ్బంది, కానిస్టేబుల్ కిరణ్ వెంటనే ఆ వ్యక్తికి సీపీఆర్ చేశాడు. దీంతో వంశీ 15 నిమిషాల తర్వాత తిరిగి శ్వాస తీసుకున్నాడు. కానిస్టేబుల్ చేసిన సీపీఆర్ తో ప్రాణాలతో బయటపడ్డాడు. విషంయ తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఇతర సిబ్బంది హెచ్.సి రాజేశ్వరరావు శ్రీశైలం, కుమార్ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేశారు. ఈ సందర్బంగా అక్కడ ఉన్న ప్రజలు పోలీస్ సిబ్బందిని ప్రశంసించారు.
Also Read: Harish Rao: అద్భుతం - CPR చేసి రోజుల చిన్నారి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది, మంత్రి హరీష్ అభినందనలు


హైదరాబాద్ లోనూ మరో ప్రాణం..


హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఓ వ్యక్తి ప్రాణాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. నడిరోడ్డుపైనే ఆ వ్యక్తికి కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బస్సు దిగిన బాలాజీ అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఎల్బీ నగర్ నుంచి బాలాజీ అనే వ్యక్తి ఆరంఘర్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఆరంఘర్ చౌరస్తాలో దిగగానే బాలాజీ గుండెపోటుతో కుప్పకూలాడు. అతణ్ని గమనించి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ వెంటనే సీపీఆర్ చేశారు. ఛాతీపై గట్టిగా పదే పదే ప్రెస్ చేసి బాలాజీ ప్రాణాన్ని రాజశేఖర్ కాపాడారు. అనంతరం బాలాజీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వరుస గుండెపోటు ఘటనలతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు, ఇతర అధికారులకు, సిబ్బందికి సీపీఆర్ పై శిక్షణ ఇప్పించింది.


Also Read: దేశవ్యాప్తంగా 2 శాతం మందికి మాత్రమే CPRపై అవగాహన- మంత్రి హరీశ్ రావు