TPCC Chief Revanth Reddy Padayatra: వరంగల్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని ఆదివాసి గిరిజన అమ్మల దర్శనం అనంతరం యాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డికి గిరిజన పూజారుల సాంస్కృతి సాంప్రదాయాలతో డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్ నుంచి పాదయత్రాలో వస్తున్న రేవంత్ రెడ్డి, పార్టీ శ్రేణులు కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగునా జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి నినాదాలు హోరెత్తాయి. దివంగత నేత వైఎస్సార్ కు చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ అయితే తనకు ములుగు సీతక్క ఇంటి ఆడబిడ్డ అని రేవంత్ రెడ్డి అన్నారు. రజాకార్లను తరిమిన గడ్డ మౌనంగా ఉంటే ఎలా? అని ప్రశ్నించారు. ఓ వైపు రైతన్నల ఆత్మహత్యలు, యువతకు నిరుద్యోగం, ఆదివాసీలకు విద్యదూరం, పోడు భూములకు పట్టాలు రాలేదు, దళితబంధు వస్తుందో రాదో తెలియదు, రైతు బంధు, రైతు బీమాల పేరుతో సబ్సిడీలు ఎత్తివేయడమేనా సంక్షేమం? అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే తన పాదయాత్ర అని స్పష్టం చేశారు.
 
వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ లో జోష్ నెలకొంది. మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న రాష్ట్ర, జాతీయ నాయకులు, కార్యకర్తలు వనదేవతలకు మొక్కులు తీర్చుకున్నారు.  సమ్మక్క సారడమ్మ గోవిందరాజు పగిడిద్ద రాజు దర్శనం అనంతరం గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్ నుంచి పస్రా, గోవిందరావుపేట వరకు కొనసాగిన పాదయాత్ర అనంతరం కాన్వాయిలో వెంకటాపూర్ మండలం పాలంపేట వరకు యాత్ర కొనసాగింది.


ములుగు జిల్లా కాంగ్రెస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలోని మేడారం నుంచి ప్రారంభించిన పాదయాత్రతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ములుగు ఎమ్మెల్యే, మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతక్క ఆధ్వర్యంలో జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ములుగు సమీపంలోని గట్టమ్మతల్లివద్దకు ఉదయం 12గంటలకు చేరుకున్న రేవంత్ రెడ్డికి సీతక్కతోపాటు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఆదివాసీ నాయకపోడ్ లు సాంప్రదాయబద్ధంగా గట్టమ్మకు పూజలుచేసి పసుపు, కుంకుమ అందజేశారు. 


అనంతరం స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలు చేసిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచి మేడారం బయలుదేరి వెళ్లారు. సీతక్క ఆధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ పూజారులు ఆదివాసీ సాంప్రదాయాల మధ్య, డోలు సన్నాయిలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వనదేవతలకు పసుపు, కుంకుమ, చీరెసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్ల వస్త్రాలను ప్రధాన పూజారులు రేవంత్ కు అందజేశారు. 
రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే !
సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తిగా ఉద్యమం కొనసాగిస్తున్నామని, రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని, సీఎం కేసీఆర్ ను గద్దె దించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యతో కలిసి అమ్మవార్లకు మొక్కుల అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్ సమీపంలోని మామిడి తోటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెన్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. భోజనం అనంతరం పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి ప్రాజెక్టు నగర్ నుంచి తప్పమంచ మీదుగా పస్రా వరకు 9కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 


అనంతరం పస్రా కూడలిలో భారీ రోడ్ షో నిర్వహించి కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అక్కడి నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించి గోవిందరావుపేట మండల కేంద్రం వరకు కొనసాగింది. అక్కడ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి స్థానిక నాయకులతో మాట్లాడిన అనంతరం అక్కడి నుంచి కాన్వాయ్ లో వెంకటాపూర్ మండలం పాలంపేటకు వచ్చారు. దీంతో పాదయాత్ర ముగిసింది. ఈ పాదయాత్రలో ఆదివాసీ సంఘాల నాయకులు, ఆర్ఎంపీ వైద్యుల సంఘం, ఎమ్మార్పీఎస్ నాయకులు, జిల్లాసాధన సమితి నాయకులు, కమ్మ కమ్యూనిటీ నాయకులు రేవంత్ రెడ్డికి పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రలో మేడారం వనదేవతలతోపాటు పస్రా వద్ద పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది భద్రత పర్యవేక్షించారు. సుమారు 5వేల మంది పాల్గొన్నట్లు నేతలు అంచనా వేస్తున్నారు. 


పాదయాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నాయకులు
రేవంత్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొన్నారు. పస్రాలో జరిగిన రోడ్ షోలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మానిక్ రావ్ ఠాక్రేతోపాటు రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి, మధు యాష్కీ, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్, సిరిసిల్ల రాజయ్య, బల్మూరి వెంకట్, బెల్లయ్య నాయక్, విజయరమణారావు, తదితరులు పాల్గొన్నారు.