Warangal Politics: సేవా దృక్పథంతో.. ఒక ప్యాషన్ తో అనేకమంది రాజకీయాల్లోకి వస్తారు. కార్యకర్త నుంచి నాయకునిగా ఎదిగేవారు కొందరు. ఇక కొంతమంది వ్యాపారాల్లో స్థిరపడి రాజకీయాల్లోకి రావాలని కోరికతో రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ పోలీసు ఉద్యోగంలో కొనసాగుతూ.. విశ్రాంత పోలీస్ అధికారులు రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. 


ఖాకీకి.. ఖద్దరుకు తీవ్ర వైరుధ్యం ఉంటుంది. కానీ అనేకమంది ఖాకీలు పోలీస్ సర్వీస్ లో ఉన్న అధికారులు రాజకీయాల్లోకి రావడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అనేక మంది పోలీస్ ఆఫీసర్లు రాజకీయాల్లోకి వస్తున్నారు. కొందరు రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ప్రజాప్రతినిధులుగా కొనసాగుతుంటే. మరి కొందరు వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో కొనసాగుతున్నారు దొమ్మాటి సాంబయ్య. 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా ప్రజా ప్రతినిధిగా గెలవలేకపోయారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రేస్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 


మరొకరు విశ్రాంత ఐపీఎస్ గా కే ఆర్ నాగరాజు గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చి వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాదులో స్థిరపడ్డ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణ ప్రసాద్ బీజేపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాల్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిగా పనిచేసిన కృష్ణ ప్రసాద్ వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఇక మరో పోలీస్ అధికారి నాగరాజు. ఈయన డీఐజీ స్థాయి అధికారిగా సర్వీస్ లో ఉన్నారు. అయితే నాగరాజు రాజకీయాల్లో రావడానికి తన సర్వీసుకు రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదించగానే రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కే ఆర్ నాగరాజు అసెంబ్లీ కి వెళ్లగా మిగతా ముగ్గురు పార్లమెంట్లో అడుగుపెట్టడానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారు.


అయితే వీరంతా ఖాకీ యూనిఫాంలో ఉండి ఖద్దర్ వైపు మళ్లుతున్నారు. 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసినవారే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీస్ ఆఫీసర్లు ఎక్కు` గా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖద్దర్ కు మించిన పవర్ మరొకటి లేదనుకొని ఖాకీ అధికారులు రాజకీయాల్లోకి రావడానికి మొగ్గు చూపుతున్నట్లుగా అర్థం అవుతోంది.