Warangal News: ప్రజల కష్ట సుఖల్లో తోడు ఉంటాం, భారత రాజ్యాంగం పై విధేయతతో విశ్వాసంగా ఉంటాం అంటూ ప్రమాణం చేశారు. చివరకు.. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన సొమ్ముతో కొందరు, అప్పులు చేసి మరి కొందరు కొనుక్కున్న భూములను కబ్జా చేస్తున్నారు. ఇది వరంగల్ మహా నగరంలోని కార్పొరేటర్‌ల వ్యవహారం.. ఈ మధ్యనే కొందరి కార్పోరేటర్‌ల తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. భూ క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్న కార్పొరేట‌ర్లు, నేత‌ల‌పై సీపీ ఏవీ రంగ‌నాథ్ ప్ర‌త్యేక దృష్టి సారించారు. బాధితుల నుంచి ఫిర్యాదు వ‌స్తే.. అన్ని కోణాల్లో ప‌రిశీలించి, ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ఏడో డివిజ‌న్ కార్పొరేట‌ర్ వేముల శ్రీ‌నివాస్‌పై కేసు న‌మోదు చేయ‌డం,  వెంట‌నే అరెస్టు చేయ‌డం, జైలుకు త‌ర‌లించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. దీంతో ఒక్క‌సారిగా గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ లో క‌ల‌క‌లం రేగింది. కబ్జా కోరుల్లో వ‌ణుకు మొద‌లైంది. ఆ త‌ర్వాత వెంట‌నే  గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 62వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ జ‌క్కుల ర‌వీంద‌ర్‌ యాద‌వ్‌ పై కూడా మ‌డికొండ పోలీస్‌ స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయింది.


కబ్జాకోరులు అసలు ఎంత మంది?


వరంగల్ తూర్పులో మహిళ కార్పొరేటర్ల భర్తలు హల్ చల్ చేస్తున్నారని టాక్. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారట. అందిన కాడికి దోచుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఖిలా వరంగల్ లో అక్రమ భూ కబ్జాలు చేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరో 8 మంది కార్పొరేటర్లు భూ కబ్జాలు చేస్తున్నట్లు సమాచారం.


భూమి ఏదైనా కబ్జా... చెయ్యడమే అసలు పని!


ఖాళీ జాగా క‌నిపిస్తేచాలు క‌బ్జా చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటున్నారట. అమాయ‌కుల‌ను బెదిరిస్తూ.. కొంద‌రు బ‌డా నేత‌ల, అధికారుల స‌హ‌కారంతో అక్ర‌మంగా రిజిస్ట్రేష‌న్లు చేయించుకుంటున్నారని లోకల్‌గా ప్రచారం నడుస్తోంది. ఈ పార్టీ, ఆ పార్టీ అన్న తేడా లేదు. అన్ని పార్టీల్లోనూ నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు.. ముసుగులేసుకుని భూ ఆక్ర‌మ‌ణ‌ల‌తో రెచ్చిపోతుంటే.. బాధితులు వ‌ణికిపోతున్నారు. కొన్నిచోట్ల బాధితులు ధైర్యం చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే.. వారు కూడా క‌బ్జా కోరుల‌కే అండ‌గా ఉంటున్నార‌నే ఆరోప‌ణలు వ‌స్తున్నాయి. వ‌రంగ‌ల్ సీపీగా ఏవీ రంగ‌నాథ్ వ‌చ్చిన త‌ర్వాత బాధితుల‌కు భ‌రోసా ల‌భిస్తోంది. ప్రజల ఫిర్యాదుల‌పై వెంట‌నే స్పందిస్తూ చ‌ర్య‌లు తీసుకుంటున్నారట. బాధితులు స్వ‌యంగా రాకున్నా.. వాట్స‌ాప్‌లో మెసేజ్ చేసినా.. సీపీ కార్యాల‌యం నుంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఈ ప‌రిణామాల‌తో క‌బ్జాకోరుల్లో వ‌ణుకు మొద‌లైంది. కబ్జా కోరుల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు.


నిన్నటికి నిన్న కాంగ్రెస్ కార్పొరేటర్ అరెస్ట్..


పార్టీలకు అతీతంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న కబ్జాదారులపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. ఇందులో భాగంగానే కాజీపేట సోమిరెడ్డి ప్రాంతంలో ఐదు గుంటల భూమిపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ పై గత రాత్రి మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి భూమి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు  పోలీసులు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రాథమిక విచారణ జరిపారు. ఈ క్రమంలోనే కార్పొరేటర్ జక్కుల రవీందర్ భూ ఆక్రమణకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. వెంటనే భూ ఆక్రమణదారుడు జక్కుల రవీందర్ పై కేసు నమోదు చేశారు. గత కొద్ది రోజులుగా వరంగల్ కమిషనర్ పోలీసులు కబ్జారాయుళ్లపై అణచివేత ధోరణిని ప్రదర్శిస్తూ సామాన్య ప్రజలకు పోలీసులు అండగా నిలుస్తుండడంతో.. తమ భూములు, స్థలాలను భూ అక్రమణదారుల నుంచి పరిరక్షించుకోవడం కోసం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు.