Telangana Latest News: నిన్న మొన్నటి వరకు పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూ తిరిగిన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. ఇప్పుడు రాష్ట్ర రాజముద్ర, తెలంగాణ గీతం చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ రాజముద్ర మార్పులు చేర్పులు, తెలంగాణ రాష్ట్ర గీతం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించడంతో కొత్త వివాదం మొదలైంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే రాష్ట్ర రాజముద్రలో నా కాకతీయ కళాతోరణం పై కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి కామెంట్స్ పై విమర్శలు వెళ్లువెత్తాయి. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో రాజముద్ర ను మార్పులు చేర్పులు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజముద్ర రూపకర్తలతో చర్చలు జరుపుతున్నారు. 


అయితే రాజముద్రలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలిగిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో పాటు అదే దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు సాగుతుండడంతో తెలంగాణ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తో పాటు బిజెపి, చరిత్రకారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాజముద్ర మార్పుపై తొలిసారిగా నిన్న వరంగల్లో కాకతీయుల రాజధాని కోటలో నిరసన తెలిపారు. బీఆర్ఎస్ తో పాటు బిజెపి సైతం కాకతీయ కోటలో నిరసన తెలిపింది. ఆయా పార్టీలతో పాటు కవులు, కళాకారులు, చరిత్రకారులు కళాతోరణం, చార్మినార్ తొలగింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 


వరంగల్‌లో కవులు కళాకారులు చరిత్రకారులు రౌండ్ టేబుల్ సమావేశం సైతం ఏర్పాటు చేసుకొని కార్యాచరణకు దిగారు. నిన్న వరంగల్ కోటలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఓ అడుగు ముందుకేసి రాజముద్ర మార్పుపై కోర్టుకు వెళ్తామని కూడా హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా రాజముద్ర వివాదం తారస్థాయికి చేరింది. 


కీరవాణితో మ్యూజిక్
మరోవైపు తెలంగాణ గీతం కూడా వివాదాస్పదం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అందించడం ఏమిటని కవులు, కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ లతోపాటు తెలంగాణ సింగర్స్ తో పాటను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మ్యూజికల్ అందించడంలో ఎవరైతే ఏంటని అనే  వాదాలను ప్రభుత్వం వైపు నుండి వినిపిస్తున్నాయి. గాయకుడు, రచయిత మిట్టపల్లి సురేందర్ ప్రభుత్వం రూపొందిస్తున్న రాష్ట్ర గీతానికంటే మెరుగైన పద్ధతిలో తాను కూడా రాష్ట్ర గీతాన్ని విడుదల చేస్తానని చెప్పారు. 


అయితే ప్రభుత్వం రాష్ట్ర గీతాన్ని రూపొందించడానికి ఎలాంటి ఇబ్బందులు లేకున్న, సమస్య అంతా ఆ గీతానికి మ్యూజిక్ అందిస్తున్న వ్యక్తి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాడుగా తెలంగాణ నాయకులు, కళాకారులు చూస్తున్నారు. అంతేకాకుండా అందెశ్రీ తో ఓ కళాకారుడు ఫోన్ చేసి మాట్లాడగా తెలంగాణలో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నారని మాట్లాడటంతో ఆ మాటలు వివాదాస్పందనమై కూర్చున్నాయి. దీంతో వివాదానికి మరింత అగ్గి రాజేసినట్టు అయ్యింది. ఇవేమీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రాష్ట్ర గీతాన్ని రూపొందించడంలో నిమగ్నమయ్యారు.




కాకతీయ కళాతోరణం, చార్మినార్ వెనక వున్న చరిత్రను చూడాలని చరిత్రకారులు, మేధావులు చెప్తున్నారు. ప్రభుత్వం వెంటనే రాజముద్ర మార్పును విరమించుకోకపోతే ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తుంది. రేపు వరంగల్ లో బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. రాజముద్ర మార్పుపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోర్టుకు వెళ్తామని హెచ్చరించడం జరిగింది. అయితే కోర్టుకు వెళ్ళినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాజముద్ర మార్పులు చేర్పులు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. కాబట్టి కోర్టుకు వెళ్లి ఉపయోగం లేదని రాజకీయ విశ్లేషకుల వాదన.
2014 తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజముద్రను మార్చారని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.


రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రలో ఉన్న రాజ్యాలకు సంబంధించిన గుర్తులకు బదులుగా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అమరవీరుల స్తూపం లాంటి గుర్తులు ఉండబోతున్నాయి. కాబట్టి ఆయా రాజకీయ పార్టీలు, మేధావులు, కళాకారులు రాజముద్ర మార్పును వ్యతిరేకించిన కొత్త రాజముద్ర విడుదల తర్వాత ఆరోపణలు, విమర్శలు ఆందోళనాన్ని సమస్య పోతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజముద్ర ను ప్రభుత్వం కొద్ది రోజులు వాయిదా వేసుకున్నా.. రాష్ట్ర గీతం, రాజముద్ర పై వివాదాలు కొనసాగుతాయా లేదా చల్లారుతాయా వేచి చూడాలి.