Warangal News: వరంగల్ జిల్లా కేంద్రంలో రెండు మూడ్రోజుల నుంచి వర్షం కురుస్తోంది. అయితే అకాల వర్షాల కారణంగా తీవ్ర పంట నష్టం జరిగి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్ద వంగర, కొడకండ్ల, దేవరుప్పుల తదితర మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లి మరీ రైతులతో నేరుగా మాట్లాడుతున్నారు. జరిగిన నష్టాల గురించి తెలుసుకుంటూ పరామర్శిస్తూ ముందుకు వెళ్తున్నారు.


తొర్రూరు మండలం మడిపల్లి, చందూర్ తండా, మాటేడు, పోలే పల్లి తదితర గ్రామాల్లో మామిడి తోటలు పూర్తిగా నాశనం అయ్యాయి. అలాగే ఇళ్లు కూలిపోయి.. నిరాశ్రయులుగా మారిన ప్రజలను కలిసి మంత్రి మాట్లాడారు. వడ్డే కొత్త పల్లి, పెద్ద వంగర, చిన్న వంగర, తదితర గ్రామాల్లోని ప్రజల బాగోగుల గురించి కూడా మంత్రి ఎర్రబెల్లి అడిగి తెలుసుకుంటున్నారు. నిన్ను రాత్రి కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న పంట నష్టాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. మాటేడు వద్ద జొన్న చేలు లో మీడియాతో మాట్లాడారు.


శనివారం కురిసిన అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని కలిగించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రైతులు వేసిన పంటలు నష్టానికి గురయ్యాయని పేర్కొన్నారు. మిరప, మొక్కజొన్న, మామిడి, టమాటో, అక్కడక్కడా వరి, కూరగాయలు వంటి పంటలతో పాటు కొన్ని చోట్ల ఇండ్లు కూడా దెబ్బ తిన్నాయని వివరించారు. ఈరోజు ఉదయం నుంచి పంట నష్టాలను తాను స్వయంగా పరిశీలిస్తున్నానని వెల్లడించారు. పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడుతున్నానని తెలిపారు. రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. మరోవైపు అధికారులు కూడా పంట నష్టాల అంచనా వేస్తున్నారన్నారు. వ్యవసాయ, రెవెన్యూ వంటి శాఖల అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని, పంట నష్టాల అంచనాలు తేలిన తర్వాత పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం పంటల నష్టాలను అంచనా వేస్తున్నామని... రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి వెంట మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.


చిగురుటాకులా వణికిపోయిన వరంగల్ 


అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ముందుగానే హెచ్చరించింది. ఈ క్రమంలో రెండు, మూడు రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లా మొత్తం చికురుటాకులా వణికిపోయింది. భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కరెంటు కూడా లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఓ వైపు అన్నదాతలు మరోవైపు సామాన్య ప్రజలు అకాల వర్షానికి ఆగమయ్యారు. ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని అందిస్తే చాలా బాగుంటుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు.