Warangal News: ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపిన 1904 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే గత జనవరి మాసం నుండి కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వాహనదారులపై పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఈనెల 9వ తేదీ వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 1904 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. జనవరి మాసంలో 505, ఫిబ్రవరిలో మాసంలో 944, మార్చి వరకు 294 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోని కేసులు నమోదు చేశారు. 




ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు..


స్వాధీనం చేసుకున్న వాహనాల్లో మైనర్ డ్రైవర్లకు చెందిన 98 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు, వాహన యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా వరంగల్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అదనపు డీసీపీ పుష్ప, ఏసీపీ మధుసూధన్ అధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక తనీఖీల్లో వరంగల్ ట్రాఫిక్ విభాగంలో 414, హన్మకొండ 300, కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 320 వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకోని కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను.. వాహన యజమాని తిరిగి పొందాలంటే లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన డ్రైవర్ కు రోడ్డు రవాణా శాఖ నుండి జారీ కాబడిన లర్నింగ్ లైసెన్స్ కాపీని కోర్టులో సమర్పించడంతో పాటు వాహన యజమానికి కోర్టు విధించిన జరిమానాను చెల్లించాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ పోలీసులు పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహించే కౌన్సిలింగ్ తరగతులకు వాహన డ్రైవర్లు ప్రత్యక్షంగా హాజరయిన అనంతరం వాహన యజమానికి వాహనం అందజేయ బడుతుందని, ఒకవేళ మైనర్ డ్రైవర్ అయితే జువైనల్ కోర్టు ముందు మైనర్ డ్రైవర్ ను హజరు పరచడంతోపాటు.. వాహన యజమానికి కోర్టు విధించిన జరిమానాను చెల్లించి కౌన్సిలింగ్ కు హాజరు కావల్సి ఉంటుందని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.


ఈ ప్రతి వాహనదారుడు తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రతీ వాహనదారుడు తమ వంతు సహకారాన్ని అందించాల్సిన బాధ్యత వాహనదారులపై ఉందని పేర్కొన్నారు. ఎలాంటి వాహన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇంజినీరింగ్..


వాహన పార్కింగ్ కోసం ప్రధాన రోడ్డు మార్గాల్లో మార్జిన్ లైన్లను గీయించి.. మార్జిన్ లైన్లలో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేసే విధంగా తగు ప్రచారం చేయాలని వివరించారు. అలాగే బ్యాంకులు, వైన్ షాపులు, బార్ల ముందుగా వాహనాల క్రమబద్ధీకరణ చేసేందుకుగా సంబంధిత యాజమాన్యం ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసుకోనే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇన్ స్పెక్టర్ అధికారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేస్తారని, త్వరలో హైదరాబాద్ తరహలోనే అపరేషన్ రోప్ నిర్వహింబడుతుందని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగేందుకు.. ప్రమాదకరమైన రీతిలో అనుమతించని ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను తరలించడం, మోటరు వాహనాలు, చిరు వ్యాపారులు, వ్యాపార సంస్థలు రహదారుల ఆక్రమణను నిరోధించడమే ఆపరేషన్ రోప్ ప్రధాన ఉద్యేశమని పోలీస్ కమిషనర్ తెలిపారు.