తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి మార్చి నెలాఖరులోగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ మేరకు గురుకుల నియామక బోర్డు సమాయత్తమవుతోంది. గురుకులాల్లో ఇప్పటికే అనుమతించిన 11,012 పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీచేసి, రాతపరీక్ష నాటికి ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా మంజూరు కానున్న పోస్టులకు అనుబంధ ప్రకటనలు ఇవ్వనుంది. భారీసంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఉండటంతో సాంకేతిక లోపాలు తలెత్తకుండా బోర్డు ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్రపతి తాజా ఉత్తర్వుల ప్రకారం స్థానికత, ఇతర సాంకేతిక అంశాలను జోడించి ట్రయల్ రన్స్ నిర్వహిస్తోంది. ఈ పోస్టుల కోసం లక్షల్లో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్న గురుకులబోర్డు ఆ మేరకు సర్వర్‌పై ఒత్తిడిని తొలగించే పనిలో నిమగ్నమైంది. గురుకులాల్లో పోస్టుల భర్తీకి మార్చి మొదటి వారంలోనే ప్రకటనలు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం గురుకుల సొసైటీలు ఉద్యోగ ప్రకటనల జారీకి అవసరమైన సమాచారాన్ని గురుకులబోర్డుకు అందజేశాయి. ఈమేరకు మార్చి నెలాఖరు నాటికి ఉద్యోగ ప్రకటనలు జారీ చేయాలని బోర్డు భావిస్తోంది.
నోటిఫికేషన్ల జారీ అనంతరం వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలని, తద్వారా గురుకులాల్లో బోధన సిబ్బంది కొరతను అధిగమించవచ్చని అంచనా వేస్తోంది. ఉద్యోగార్థులు గురుకుల పోస్టులకు సన్నద్ధమయ్యేందుకు.. ప్రకటన వెలువడినప్పటి నుంచి రాతపరీక్ష నిర్వహణ తేదీకి మధ్య కనీసం నాలుగు నెలల వ్యవధి ఉండాలని భావిస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు కనీసం నెల రోజుల గడువు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఇతర పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌ను సిద్ధం చేయనున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. 2023-24 విద్యాసంవత్సరం నాటికి నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read:
TSPSC: వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టుల భర్తీకి మార్చి 15, 16 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 10న విడుదల చేసింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (TPBO) పోస్టుల భర్తీకి మార్చి 12న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రాతపరీక్ష హాల్‌టికెట్లను మార్చి 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
గ్రూప్-2 పరీక్ష తేదీ వెల్లడి..
తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూలును త్వరలోనే ప్రకటించనున్నారు. పరీక్షలకు వారం ముందునుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ ప్రకటించింది. తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16తో ముగిసిన సంగతి తెలిసిందే.
గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి..