Warangal News: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 147 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ తెలియజేశారు. దేశంలో బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనలో భాగంగా జనవరి ఒకటో తేదీ నుండి 31వ తేది వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ 9వ విడత కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. ఇందులో భాగంగానే కమిషనరేట్ పరిధిలో పోలీసు, ఏహెచ్ ఎన్టీయూ (యాంటీ హ్యమన్ ట్రాఫికింగ్ యూనిట్), చైల్డ్ లైన్, లేబర్ విభాగాలు సంయుక్తంగా కలిపి తొమ్మిది బృందాలుగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పరిశ్రమలు, ఇటుక తయారీ పరిశ్రమ, కంకర క్రషర్స్, షాపింగ్ మాల్స్, వ్యాపార సముదాయాలు, హోటళ్లలో ఆకస్మిక తనీఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ తనీఖీల్లో 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న మొత్తం 147 మంది బాల కార్మికులకు పనుల నుండి విముక్తి కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు.
117 మంది బాలురు, 30 మంది బాలికలు..
ఇందులో 117 మంది బాలురు, 30 మంది బాలికలు ఉన్నారని వివరించారు. విముక్తి కలిగించిన మొత్తం బాల కార్మికుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 56 మంది కాగా, మిగితా 91 మంది దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చిన్నారులుగా పోలీసులు విచారణలో గుర్తించడం జరిగింది. తనీఖీల్లో గుర్తించబడిన చిన్నారులను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచి చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. అలాగే చిన్నారులతో పనులు చేయించుకుంటున్న వ్యాపారస్థులపై మొత్తం 12 కేసులను నమోదు చేయడం జరిగిందని సీపీ రంగనాథ్ వెల్లడించారు. ఈ తనీఖీల్లో రెండు సంవత్సరాల క్రితం పర్కాల పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన బాలుడుని ఈ ఆపరేషన్ స్మైల్ ద్వారా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.
18 ఏండ్ల లోపు పిల్లలతో పని చేయించుకోవడం చట్టరీత్యా నేరం
చిన్నారుల బాల్యన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, వారి ప్రాధమిక హక్కులకు భంగం కలిగించవద్దని సీపీ రంగనాథ్ సూచించారు. 18 ఏళ్ల లోపు చిన్నారులతో పనులు చేయించుకోవడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా చిన్నారులతో పనులు చేయించుకుంటున్నట్లుగా సమచారం అందింతే డయల్ 100 గాని, చైల్డ్ లైన్ నంబర్ 1098 నంబర్ సమాచారాన్ని అందించాల్సిందిగా పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు.
నెలరోజుల పాటు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది
ఒక ఐస్ఐ, నలుగురు పీసిలు, డీసీపీయూ సిబ్బంది, సహాయ కార్మిక అధికారి, రెవెన్యూ అర్.ఐ, చైల్డ్ లైన్ సిబ్బందితో కలిపి జిల్లాలో డివిజన్ స్థాయిలలో రెండు బృందాలను ఏర్పాటు చేశామని సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ఈ బృందాలు జిల్లాలో తప్పిపోయిన, పారిపోయిన బాల బాలికలను, బాల కార్మికులను, బిక్షాటన చేసే పిల్లలను, అక్రమ రవాణాకు గురైన పిల్లలను గుర్తించి, బాలల సంక్షేమ సమితి ముందు హాజరు పరిచిందని పేర్కొన్నారు. నిరాశ్రయులైన పిల్లలకు వివిధ స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రభుత్వ బాల సధనాల్లో ఆశ్రయం కల్పిస్తుందని, తద్వారా వారికి బంగారు భవిష్యత్తు అందించవచ్చని సూచించారు. గత సంవత్సరం 2022లో 52 మంది బాల బాలికలను కాపాడినట్లు తెలిపారు. అంతే కాకుండా, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పిల్లలకు డీసీపీయూ అధ్వర్యంలో చదువు చెప్పించడం జరుగుతుందని, అలాగే వృత్తి విద్య కోర్సుల్లో కూడా శిక్షణను ఇప్పిస్తుందని వివరించారు.