కల్తీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాల మీదకి తెస్తున్నారు. ఇదివరకే పలు చోట్ల కల్తీ మద్యం సేవించి తరచుగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనల గురించి వింటుంటాం. కల్తీ మద్యం విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమై వైన్ షాప్ సీజ్ చేశారు. 


మహబూబాబాద్ జిల్లా  తొర్రూర్ లో కల్తీ మద్యం విక్రయిస్తున్న వైన్ షాప్ ను తొర్రూరు ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తోర్రూర్ పట్టణంలోని అమ్మాపురం రోడ్ లో ఉన్న శ్రీనివాస్ వైన్ షాప్ లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పక్కా సమాచారం రావడంతో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు  బుధవారం తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో 11 హాఫ్ బాటిల్లు, 24 ఐబి క్వార్టర్లు, మరికొన్ని బాటిల్స్ ఎక్సైజ్ అధికారులకు లభ్యమయ్యాయి. ఎక్సైజ్ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శ్రీనివాస వైన్స్ ను సీజ్ చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. కల్తీ మద్యం విక్రయించడం మాత్రమే కాదు, ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలను మించి అధిక ధరలకు మద్యం విక్రయించినా చర్యలు తప్పవని వైన్ షాప్ నిర్వాహకులను హెచ్చరించారు. ఈ తనిఖీలో టాస్క్ ఫోర్స్ అధికారి చిరంజీవి, సిబ్బంది పాల్గొన్నారు.