Mekapati Chandrashekar Reddy : నిన్నటి వరకు రెండో భార్య, అసలు కొడుకు అంటూ విమర్శలను ఎదుర్కొన్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పుడు మరో సంచలనంతో వార్తల్లోకెక్కారు. తన నియోజకవర్గంలో పార్టీ నియమించిన పరిశీలకుడి వ్యవహారం బాగోలేదని ఆరోపించారు. అసంతృప్తి వెళ్లగక్కారు. శాసనసభ్యుడికి ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరించాల్సిన పరిశీలకుడు.. నియోజకవర్గంలో చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు. తనను ధనుంజయరెడ్డి ఇబ్బంది పెడుతున్నాడంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశానని అన్నారు. పరిశీలకుడు ధనుంజయ రెడ్డి నిర్ణయాల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందన్నారు. వైఎస్సార్ కుటుంబానికి విధేయుడైన తనపై అతను పెత్తనం చేయడం కుదరదన్నారు. ముఖ్యమంత్రి దగ్గరైనా, జిల్లా మంత్రి దగ్గరైనా తేల్చుకోవడానికి తాను సిద్ధమన్నారు. 


వైసీపీ పరిశీలకుడిపై ఎమ్మెల్యే ఆగ్రహం 


నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించగా, ఆనం రాంనారాయణ రెడ్డి కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఒకరు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే, మరొకరి అధికారులు సహకరించడంలేదంటున్నారు.  ఆనం, కోటంరెడ్డి వ్యవహారం ముగియక ముందే మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం వినిపించారు. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో పరిశీలకుడు చిచ్చు పెడుతున్నారని ఆరోపణలు చేశారు. తనను ధనుంజయరెడ్డి ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయంపై సీఎంకు ఫిర్యాదు చేశానని చంద్రశేఖర్ రెడ్డి బాహాటంగా ప్రకటించారు. నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయ రెడ్డి నిర్ణయాలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఎమ్మెల్యే అన్నారు. తన మీద పెత్తనం చేయడం ఇకపై కుదరదని చంద్రశేఖర్ రెడ్డి తేల్చిచెప్పారు. మేకపాటి తాజా కామెంట్స్ మరోసారి నెల్లూరు జిల్లా వార్తల్లో నిలిచింది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై  మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. వీరి భేటీలో నెల్లూరు రూరల్ ఇన్ ఛార్జ్  ఎవరనే దానిపై చర్చించారు. నేడో, రేపో నెల్లూరు రూరల్ కు పార్టీ ఇన్ ఛార్జ్ ను ప్రకటించనున్నారు. ఇటీవల వెంకటగిరికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పార్టీ ఇన్ ఛార్జ్ గా ప్రకటించింది. పార్టీ ఇన్ ఛార్జ్ లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు అని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. 


ధనుంజయరెడ్డి వల్ల పార్టీకి చెడ్డపేరు 


"పరిశీలకుడి పనేంటి పార్టీలో ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పరిష్కరించాలి. కానీ ధనుంజయ రెడ్డి ఏంచేస్తున్నాడు. నాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ల దగ్గరకు వెళ్లి వాళ్లను రెచ్చగొట్టి కేసులు పెట్టిస్తున్నాడు. టీడీపీ వాళ్లకు పనులుచేయాలని కోరుతున్నాడు. ఆ విధానం సరికాదు. ధనుంజయ టీడీపీ వ్కక్తే. సీఎం జగన్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించాను. ఆయనను తొలగించాలని కోరాను. ఇతర నియోజకవర్గాల్లో ఇలానే జరుగుతున్నాయా? . ఇతడి వల్ల పార్టీకి చెడు జరుగుతోంది. నేను వైఎస్ఆర్ కుటుంబానికి ఆత్మీయుడిని. సీఎం జగన్ కోసం రిజైన్ చేసిన వాడిని. నాపై పెత్తనం చేయాలించాలని చూస్తే కుదరదు." -  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే