Clay Pots Demand: పేదోడి ఫ్రిజ్ కు భలే గిరాకీ పెరిగింది. మట్టిలో మాణిక్యం లభిస్తుందో లేదో తెలియదు కానీ మట్టి కుండలో మాత్రం ఆరోగ్యం లభిస్తుంది. వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రజల అవస్థలు వర్ణనాతీతం. సామాన్యుడి పరిస్థితి మరింత దుర్భరం. పగలు ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. వరంగల్ జిల్లాలో మట్టి కుండకు పెరిగిన మహా డిమాండ్ అంతా ఇంతా కాదు.


పెరిగిన ఎండలు...


ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. ఇంట్లో ఉన్న ఫ్రిజ్ నీళ్లు తాగితే లేనిపోని రోగాలు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఇలాంటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయి అంటున్నారు స్థానికులు. కనుక ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రజలు ప్రకృతి సిద్ధంగా లభించే మట్టి కుండలనే ఆశ్రయిస్తున్నారు. పైగా ఎండా కాలంలో పేదవాడి ఫ్రిజ్ గా పేరున్న మట్టి కుండలకు బాగా డిమాండ్ పెరిగింది. మన పూర్వీకులు మట్టి పాత్రలను అన్నింటికి ఉపయోగించేవారు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా మట్టి పాత్రల స్థానంలో నేడు, స్టీలు, సిల్వర్ జర్మనీ, ప్లాస్టిక్, రాగి, ఇత్తడి, అల్యూమినియం తదితర పాత్రలు వాడుకలోకి వచ్చాయి. గతంలో పేద కుటుంబాలు మాత్రమే మట్టి కుండలను వినియోగించేవారు. ప్రస్తుతం ఆరోగ్యరీత్యా, మధ్య తరగతి, ధనికులు నగర-పట్టణ గ్రామాల్లో ప్రజలు కూడా వైద్యుల సలహా మేరకు మట్టి కుండలో నీరు తాగడం అలవాటు చేసుకున్నారు. ఆధునిక యుగంలో సైతం మట్టికుండల పై పలువురు ముచ్చట పడుతున్నారు. కాలానికి అనుగుణంగా మారుతున్న సమాజం మళ్లీ మట్టి కుండల వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పట్టణాల్లో, నగరాలలో కూడా మట్టి కుండలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం కుండలు రూ :250 నుండి 300 వందల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. వేసవి కాలం కావడంతో మార్కెట్లో మట్టి కుండలకు మంచి డిమాండ్ ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. 


మట్టి కుండతో మంచి ఆరోగ్యం


మట్టి కుండలో నీరు శ్రేష్టమని కనీసం ఎండా కాలంలో నైనా మట్టి కుండలో నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవి కాలంలో కుండలో నీళ్లు తాగాలి. ఈ నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. చిన్న పిల్లలు, పెద్ద వారైనా సరే ఫ్రిజ్ నీళ్లు కంటే కుండలో నీళ్లు తాగితే మంచిది. కాబట్టి అందు కోసమే మేము ఈ కుండను కొనుగోలు చేశామని.. ఫ్రిజ్ నీళ్లు తాగితే జలుబు, గొంతు నొప్పి ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి.. డాక్టర్లు కూడా కుండలో నీళ్లు తాగాలని సూచిస్తున్నట్లు వివరిస్తున్నారు. 


అందుబాటులో కుండలు - ఆరోగ్యం కోసం ప్రజలు


అందరికీ అందుబాటులో ఉండే ధరలతో పాటు చల్లని నీటిని, చక్కటి ఆరోగ్యాన్ని అందించే కుండల తయారీ వెనుక.. ఎంతోమంది చెమట చుక్కలు ఉన్నాయంటున్నారు కుండల తయారీ దారులు. మట్టి తెచ్చి కుండలు తయారు చేయడం కుమ్మరి కుల వృత్తి. తమతోనే కనుమరుగైపోతున్న నేటి కాలంలో తమ పిల్లలు కుమ్మరి వృత్తిపై ఆధారపడి బ్రతికే పరిస్థితులు లేవని.. కాబట్టి తమ పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని కుమ్మరి వృత్తిని కొనసాగించాలంటే.. ప్రస్తుతం ఉన్న ధరలతో తమ కడుపులు నిండువని అంటున్నారు. ప్రస్తుతం కుండల సైజులు, డిజైన్ లు బట్టి 250 నుండి 700 వందల వరకు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో మట్టి కుండకు బలే గిరాకీ ఉంది. మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు సైతం మట్టి  కుండలో నీరు తాగితే ఉపయోగం అని పెద్దల మాట.. ఆ మాటని ఇప్పుడు తూచా తప్పకుండా పాటిస్తున్నారు పట్టణ ప్రజలు.