వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఐసీయూలో చికిత్స తీసుకుంటూ ఎలుకల దాడిలో గాయపడిన శ్రీనివాస్ మృతి చెందాడు. అతడి ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో నిన్న మధ్యాహ్నం ఎంజీఎం నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అయినా శ్రీనివాస్ కోలుకోలేదు. శుక్రవారం అర్థరాత్రి మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
హనుమకొండ జిల్లా భీమారం వాసి అయిన శ్రీనివాస్ బంగారం దుకాణంలో పని చేస్తున్నాడు. కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధితో మార్చి 26న ఎంజీఎంలో చేరాడు. ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు ఎంజీఎం వైద్యులు. డయాలసిస్ అవసరం ఉంటే చేశారు.
ఆయన్ని రెండు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఎలుకలు కరవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైది. ఐసీయూలో కదల్లేని స్థితిలో ఉన్న శ్రీనివాస్ రక్తపుమడుగులో ఉన్న విషయాన్ని భార్య గమనించి వైద్యులకు చెప్పింది. పరీక్షించిన వైద్యులు ఎలుకలు కరచినట్టు తేల్చారు.
ఐసీయూలో ఉన్న రోగిని ఎలుకలు కొరడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌తోపాటు ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆసుపత్రిని సందర్శించారు. రోగి శ్రీనివాస్ పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. శ్రీనివాస్‌కు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించిన శ్రీనివాస్‌ను రక్షించుకోలేకపోయారు. చికిత్స తీసుకుంటూనే శుక్రవారం అర్థరాత్రి శ్రీనివాస్ మృతి చెందాడు.