Warangal Medico Preethi Death Case: వరంగల్ ఎంజీఎంలో మెడికో ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పది వేల బాండ్, ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర నిందితుడు సైఫ్ కు బెయిల్ మంజూరు చేశారు.


ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధ విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతులు విధించారు. చార్జిషీటు దాఖలు చేసే నాటికి లేదా 16 వారాల వరకు విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని నిందితుడు, సీనియర్ విద్యార్థి సైఫ్ నకు ఆదేశించింది కోర్టు. అయితే ప్రీతి డెత్ కేసులో సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను మూడుసార్లు న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో 56 రోజుల తరువాత నిందితుడు సైఫ్ జైలు నుంచి విడుదల కానున్నాడు. గురువారం (ఏప్రిల్ 20న) ఖమ్మం జైలు నుంచి సైఫ్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సైఫ్ తరఫు లాయర్లు సంబంధిత పత్రాలను జైలు అధికారులకు సమర్పించడం, కోర్టు ఉత్తర్వుల కాపీ జైలుకు అందిన తరువాత రేపు ఖమ్మం జైలు నుంచి విడుదల కానున్నాడు.


అసలేం జరిగిందంటే.. 
గత ఏడాది డిసెంబర్ 6వ తేదీ నుంచి మూడుసార్లు పీజీ అనస్తీషియా ఫస్టియర్ స్టూడెంట్ ప్రీతికీ, సీనియర్ సైఫ్‌కీ మధ్య విభేదాలు వచ్చాయి. సార్ అని కచ్చితంగా పిలవాలని కండీషన్ పెట్టడం, కేస్ షీట్లు చెక్ చేసి తెలివిలేదు అంటూ గ్రూపులో మెస్సేజ్ లు పెట్టడంతో ప్రీతి భరించలేకపోయింది. తాను ఏమైనా తప్పు చేస్తే గ్రూపులో మెస్సేజ్ లు కాదు, హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని ప్రీతి పలుమార్లు తన సీనియర్ సైఫ్ కు సూచించింది. అయినా పరిస్థితిలో మార్పు లేదు, ర్యాగింగ్ కొనసాగింది. వేధింపులు ఎక్కువ కావడంతో ప్రీతి ఒత్తిడికి లోనైంది. ఫిబ్రవరి 18న వాట్సాప్ గ్రూప్‌లో ప్రీతితో ఛాటింగ్ చేసి మరోసారి వేదించాడు సైఫ్. 20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి తల్లిదండ్రులకు ప్రీతి వివరించింది. మేనేజ్ మెంట్ వద్దకు విషయం చేరడంతో ఫిబ్రవరి 21న సైఫ్, ప్రీతిని పిలిచి విచారించారు. ఈ క్రమంలో 22వ తేదీన హానికారక ఇంజెక్షన్ తీసుకుని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఇది ఆత్మహత్యాయత్నం కాదని, ప్రీతికి బలవంతంగా విషపు ఇంజెక్షన్ చేశారని.. డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలించి ట్రీట్మెంట్ చేశారంటూ ప్రీతి తండ్రి, సోదరుడు ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. కూతురు బ్రెయిన్ డెడ్ అయిందని, బతికే అవకాశం లేదన్నారు. ఫిబ్రవరి 26 రాత్రి ప్రీతి  బ్రెయిన్ డెడ్ అయి మృతిచెందినట్లు ప్రకటించడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.


ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్ గ్రేషియా 
 ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వపరంగా ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో రూ.20 లక్షలు ప్రకటించారు.  వైద్య విద్యార్థిని మరణానికి కారణమైన వారు ఎంత పెద్దవారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు.