వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం జనవరి 18 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన హన్మకొండ జిల్లాలోని జీడబ్ల్యూఎంసీ పరిధిలోని వార్డులలో నిర్వహించే కంటి వెలుగు -2 సన్నాహక సమావేశంలో కార్పొరేటర్లు, జిల్లా వైద్య ఆరోగ్య, మునిసిపల్, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
జనవరి18 నుంచి ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు
ఈ నెల 18వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ కంటి పరీక్షలు చేయనున్నారు. ఈ కంటి వెలుగు కార్యక్రమంలో పెద్దవారికి ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష నిర్వహించాలని సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. ఇది కేవలం ఒక కంటి వెలుగు కార్యక్రమమే కాదు, నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమమని అన్నారు. కంటి వెలుగు-2 కార్యక్రమం జనవరి 18న ప్రారంభమై 100 పని దినాల్లో జరుగుతుందన్నారు. కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైతే అద్దాలు ఇవ్వడం, లేదా వారు తీసుకోవాల్సిన పోషకహారాలు, జాగ్రత్తలు సూచించడం జరుగుతుందని అన్నారు.
ఉచిత వైద్యం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణలో అంధత్వానికి గురైన లేదా కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరికీ, అత్యున్నత స్థాయి మరియు నాణ్యత కలిగిన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కంటి సమస్య ఉన్న ప్రతీ ఒక్కరికీ లబ్ధి చేకూరే విధంగా రూపొందించిన కార్యాచరణను అమలు చేస్తూ అర్హులను ఉచిత కంటి పరీక్ష శిబిరానికి తప్పక చేర్చడం మన అందరి బాధ్యత అన్నారు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. కంటి వెలుగు మన ఇంటి వెలుగుని 18 సం.రాలు నిండిన హన్మకొండ జిల్లాలోని జీడబ్ల్యూఎంసీ పరిధిలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శిబిరాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు.
హన్మకొండ జిల్లాలోని వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని జీడబ్ల్యూఎంసీ పరిధిలో గల 35 డివిజన్ లలో శిబిరాలు ఏర్పాటు చేయుటకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. 100 రోజులపాటు జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజల సౌకర్యార్థం 35 డివిజన్లోని 52 లొకేషన్లలో మొత్తం 20 మెడికల్ టీంల ద్వారా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి శిబిరానికి జీడబ్ల్యూఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ నుంచి నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్ల ద్వారా చైతన్యం కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ సాంబశివ రావు, అదనపు కమిషనర్ రవీందర్ యాదవ్, ముఖ్య ఆరోగ్యాధికారి డా.జ్ఞానేశ్వర్, కార్పొరేటర్లు, ప్రోగ్రాం అధికారి, నోడల్ అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.